ఆదివారం 29 మార్చి 2020
National - Feb 29, 2020 , 16:43:08

అందరి పరిస్థితి నిలకడగానే ఉంది: ఢిల్లీ హెల్త్‌ మినిస్టర్‌

అందరి పరిస్థితి నిలకడగానే ఉంది: ఢిల్లీ హెల్త్‌ మినిస్టర్‌

ఢిల్లీ: రాజధాని రాష్ట్రం ఢిల్లీలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా, అనుకూలంగా నినాదాలు, ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇరు వర్గాల పౌరులు తీవ్ర ఘర్షణలు పడిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించగా, వందలాది మంది గాయాలపాలయ్యారు. కాగా, ఈ ఘటనల పట్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. ఈశాన్య ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలు మోహరించడంతో పాటు.. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఆయా ప్రదేశాల్లో పర్యటించి.. ప్రజలకు పరిస్థితులపై అవగాహన కల్పించారు. 

కాగా, ఇవాళ ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.. సత్యేందర్‌ జైన్‌ దాడిలో గాయపడిన వ్యక్తులను జీటీబీ ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని కలిసి, వారితో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఇప్పటికీ 45 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. వారి పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. 


logo