బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 15:35:24

బిహార్‌లో ప్రతి ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు లక్షాధికారి / నేరస్థుడు

బిహార్‌లో ప్రతి ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు లక్షాధికారి / నేరస్థుడు

పాట్నా : మన దేశంలో వైద్యులు, ఇంజనీర్లు, డిగ్రీ చదివిన వారు ఎందరో ఉన్నారు. ఇంకా ఎందరో పట్టాలు సంపాదించేందుకు ఆరాటపడుతున్నారు. కానీ, మన దేశంలో నాయకుడిగా ఉండటానికి ఎలాంటి అర్హతలు అవసరం లేదు. లక్షాధికారి అయి వుండి నేరాల్లో పాలుపంచుకుంటే అవే పెద్ద అర్హతలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న బిహార్ ఎన్నికలలో అడుగుపెట్టిన అభ్యర్థుల నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రతి ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు లక్షాధికారి గానీ, నేరస్థుడుగా గానీ తేలారు. ఈ విషయాలను అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) గురువారం వెల్లడించింది.

మూడు విడుతల్లో బిహారల్లో అసెంబ్లీ ఎన్నికల్లు జరుగుతున్నాయి. 243 స్థానాలకుగాను మొత్తం 3,733 మంది అభ్యర్థులు రంగంలో దిగారు. వీరిలో 371 మంది మహిళలు, ఒక థర్డ్‌ జెండర్‌ ఉన్నారు. కాగా, మొత్తం 3,733 మందిలో 860 మంది కోటీశ్వరులుగా తేలారు. 1,201 మందిపై క్రిమినల్‌ కేసులు, 921 మందిపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయి. మొదటి దశ ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల్లో 328 మంది, రెండో దశ అభ్యర్థుల్లో 502 మంది, మూడో దశ అభ్యర్థుల్లో 371 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. అత్యధికంగా రాష్ట్రీయ జనతా దళ్‌ అభ్యర్థులు 98 మంది ఉండగా.. బీజేపీ నుంచి 76 మంది, జేడీయూ నుంచి 56 మంది, కాంగ్రెస్‌ నుంచి 45 మంది, ఇతరులు 99 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 115 మందిపై మహిళలను వేధించిన కేసులు, 12 గురిపై లైంగికవేధింపులు, 73 మంది హత్య, 278 మందిపై హత్యకు ప్రేరేపించడం వంటి  కేసులు నమోదయ్యాయి. మహిళా అభ్యర్థులు తక్కువేం కాదు.  బిహార్‌కు చెందిన ఐదుగురిపై ఎక్కువగా కేసులు ఉన్నాయి. వీరిలో అత్యధికంగా భారతీదేవిపై 15 కేసులు ఉండగా, ఆరతి సిన్హాపై 9, నీతూ కుమారిపై 7, ఆశాదేవి, పూనమ్‌దేవిలపై 5 చొప్పున కేసులు నమోదయ్యాయి.

కాగా, 290 మంది అభ్యర్థులు రూ.5 కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులు కలిగివున్నారు. 447 మందికి రూ.2 కోట్లకు పైగా.. 1,058 మందికి రూ. 50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు, 1,145 మంది వద్ద రూ.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, 782 మంది అభ్యర్థుల వద్ద రూ.10 లక్షల కన్నా తక్కువ ఆస్తులు ఉన్నాయి. రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీ నుంచి ఏకంగా 120 మంది కోటీశ్వరులు ఉండగా.. బీజేపీలో 94 మంది, జేడీయూలో 96 మంది, కాంగ్రెస్‌లో 51 మంది, ఇతరులు 131 మంది ఉన్నారు. కోటీశ్వరుల జాబితాలో బీకే సింగ్‌ (రూ.85.89 కోట్లు), అనంత్‌ కుమార్‌ సింగ్‌ (రూ.68.56 కోట్లు), గజానంద్‌ షాహీ (రూ.61.23 కోట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, 9 మంది అభ్యర్థుల వద్ద అసలు ఆస్తులే లేవని ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు. 

ఇక చదువుల విషయానికొస్తే.. 15 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 32 మంది డిప్లొమాలు, 322 మంది టెన్త్‌, 1,794 మంది గ్రాడ్యుయేట్లు, 1,556 మంది ఇంటర్‌ వరకు చదివారు. మొత్తం అభ్యర్థుల్లో ఇద్దరు 80 ఏండ్లకు పైబడినవారు కాగా.. 61-80 మధ్య వయసు వారు 391 మంది, 41-60 మధ్య వయసు వారు 1,794 మంది, 25-40 మధ్య వయసు వారు 1,535 మంది ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.