బుధవారం 03 జూన్ 2020
National - May 22, 2020 , 21:28:17

యూపీలో ఎస్మా ప్రయోగం.. యోగి సర్కారు సంచలన నిర్ణయం

యూపీలో ఎస్మా ప్రయోగం.. యోగి సర్కారు సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఆరు నెలలపాటు అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనుమతి మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముకుల్ సింఘాల్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

ఎస్మాకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది మొదలు వచ్చే ఆరు నెలలపాటు రాష్ట్రంలో ప్రజా సేవలను స్తంభింపజేయడంపై నిషేధం విధించేందుకు గవర్నర్ సమ్మతించారు. ఈ ఆరు నెలలు ప్రభుత్వం, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల ఆధీనంలోని ఎలాంటి సేవలైనా నిలిపివేయడం కుదరదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్మా చట్టం అమల్లో ఉండగా పోస్టల్, టెలీగ్రాఫ్, రైల్వే, పోర్టు కార్యకలాపాలు సహా అత్యవసర సేవల విభాగాలకు చెందిన ఉద్యోగులెవరూ సమ్మె చేసేందుకు వీల్లేకుండా నిషేధం కొనసాగుతుంది. 

ఎస్మా చట్టాన్ని ఉల్లంఘిస్తే నిందితులకు ఏడాదిపాటు జైలుశిక్ష లేదా వెయ్యి రూపాయలు జరిమానా లేదా రెండూ ఏకకాలంలో విధించే అవకాశం ఉంటుంది. సమ్మె చేసేవారే కాదు, సమ్మెకు ప్రోత్సహించే వారు కూడా ఈ చట్టం ప్రకారం నేరస్తులే అవుతారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిచిన వారిని ఎలాంటి అరెస్టు వారెంట్ లేకుండానే అరెస్ట్‌ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.


logo