ఆదివారం 05 జూలై 2020
National - Jun 30, 2020 , 14:27:52

సాంకేతిక అంతరాలు తొలిగితేనే సమాన విద్య సాధ్యం

 సాంకేతిక అంతరాలు తొలిగితేనే సమాన విద్య సాధ్యం

న్యూఢిల్లీ : విద్యావ్యవస్థలోని సాంకేతిక అంతరాలను తొలగించడం ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్య లక్ష్యాలను చేరుకోవడంతోపాటు అందరికీ మాధ్యమిక, ఉన్నతవిద్యను అందించేందుకు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఉపరాష్ట్రపతి భవన్‌లోని సర్దార్ పటేల్ సమావేశ ప్రాంగణంలో.. ఐసీటీ అకాడెమీ రూపొందించిన ‘ఫ్యూచర్ ఎడ్యుకేషన్-నైన్ మెగాట్రెండ్స్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ..  సమాజంలోని ప్రతి ఒక్కరికీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తూ.. ఎందరో చిన్నారులకు సాంకేతిక ఉపకరణాల వినియోగం తెలియదని, ఇందుకు చాలా కారణాలున్నాయన్నారు. ఈ అంతరాన్ని తగ్గించడం ద్వారా.. అలాంటి వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి.. తద్వారా మారుతున్న సాంకేతికతను వారు వినియోగించుకునే దిశగా మనమంతా కృషిచేయాలని సూచించారు.

 లాక్‌డౌన్ కారణంగా చాలా మంది విద్యార్థులు సాంకేతిక ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో ఆన్‌లైన్ విద్యావిధానంలో భాగమయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వీరందరు ఆన్‌లైన్ విధానంలో విద్యనభ్యసించేందుకు సరైన శిక్షణను అందించాల్సిన అవసరముందని చెప్పారు. మన దేశంలోని చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఆధునిక పద్ధతిలో విద్యనభ్యసించేందుకు అవసరమైన ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి సాంకేతిక ఉపకరణాల ఖర్చును భరించలేని స్థితిలో ఉన్నారని గుర్తుచేశారు. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో చదువులకు ఆటంకం కలుగకుండా విద్యాసంస్థలు డిజిటల్ క్లాసులు నిర్వహించడం, క్లౌడ్ ఆధారిత వేదికల ద్వారా విద్యాబోధనతోపాటు పరీక్షలు కూడా ఆన్‌లైన్లోనే నిర్వహిస్తున్నారన్నారని, ఇది ఆహ్వానించదగిన పరిణామమని వెంకయ్యనాయుడు అన్నారు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), వర్చువల్ రియాలిటీ, అగుమెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానంతోనే తరగతుల నిర్వహణ జరుగుతుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా కొత్త పద్ధతులను అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. 


logo