ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 03:28:34

ప్రపంచంలోని పులుల్లో 70 శాతం భారత్‌లోనే

ప్రపంచంలోని పులుల్లో  70 శాతం భారత్‌లోనే

  • కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడి
  • ‘పులుల గణన-2018’ నివేదిక విడుదల 

న్యూఢిల్లీ: ప్రపంచంలోని మొత్తం పులుల్లో భారత్‌లోనే 70 శాతం ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ఇందుకు భారత్‌ గర్విస్తున్నదని చెప్పారు. పులుల సంఖ్యను పెంచేందుకు టైగర్‌ రిజర్వ్‌లున్న 13దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవం నేపథ్యంలో మంగళవారం ఆయన ‘ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌-2018’ నివేదికను విడుదల చేశారు. ఉత్తరాఖండ్‌లోని కార్బెట్‌ పులుల సంరక్షణ కేంద్రంలో దేశంలోనే అత్యధికంగా 231 పులులు ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. దేశంలోని మొత్తం 50 పులుల సంరక్షణ కేంద్రాలకుగాను మిజోరంలోని దంపా, పశ్చిమబెంగాల్‌లోని బుక్సా, జార్ఖండ్‌లోని పలమావు కేంద్రాల్లో ఒక్క పులి కూడా లేదని నివేదిక తెలిపింది. దేశంలో మొత్తం పులులు 2,967 ఉండగా టైగర్‌ రిజర్వుల్లో (అభయారణ్యాల్లో) 1,923 ఉన్నాయి. దేశంలోని మొత్తం పులుల్లో ఇవి 65 శాతం. మిగతా పులులు జంతుప్రదర్శనశాలల్లో ఉన్నాయి. రాష్ర్టాలవారీగా అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 526 పులులు ఉండగా, కర్ణాటకలో 524, ఉత్తరాఖండ్‌లో 442 పులులు ఉన్నాయి. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, అసోం, పశ్చిమబెంగాల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ర్టాల్లో అభయారణ్యాలు విస్తీర్ణం పరంగా భారీగా ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో ఆ అభయారణ్యాల్లో పులుల సంఖ్య లేదని నివేదికలో పేర్కొన్నారు.


logo