సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 13:39:31

ఇదే ఎన్‌.జి.రంగాకు ఇచ్చే నిజ‌మైన నివాళి : ఉప‌రాష్ర్ట‌ప‌తి

ఇదే ఎన్‌.జి.రంగాకు ఇచ్చే నిజ‌మైన నివాళి : ఉప‌రాష్ర్ట‌ప‌తి

ఢిల్లీ : అందరికీ ఆహారం అందించేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతల సంక్షేమం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయ‌డ‌మే ఎన్‌.జి. రంగాకు ఇచ్చే నిజమైన నివాళి అని భార‌త ఉపరాష్ర్ట‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు  ఆచార్య ఎన్.జి.రంగా 120వ జయంతి నేడు. ఈ సందర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఎన్‌.జి.రంగా చిత్ర‌ప‌టానికి ఉప‌రాష్ర్ట‌ప‌తి పుష్పాంజ‌లి స‌మర్పించి నివాళులు అర్పించారు. రంగా ట్రస్ట్ నిర్వహించిన కార్య‌క్ర‌మంలో వెంక‌య్య‌నాయుడు పాల్గొని మాట్లాడుతూ..  రైతు సంక్షేమం దిశగా ఎన్‌.జి.రంగా కృషి మరువలేనిద‌న్నారు. భూమాత ముద్దుబిడ్డ ఎన్‌.జి.రంగా అని కొనియాడారు. 


భారత వ్యవసాయాన్ని సుస్థిర ప‌రిచేందుకు, లాభదాయకంగా మార్చేందుకు బహుళ ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న విధానాల‌ను, అభ్యాసాల‌ను మార్చ‌డం ద్వారా త‌క్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్ప‌త్తి చేయ‌గ‌లుగుతామ‌న్నారు. స్వామి సహజనంద్ సరస్వతితో పాటు భారత కిసాన్ ఉద్యమ పితామహుడిగా ఎన్‌.జి.రంగా పరిగణించబడ్డార‌న్నారు. రైతులందరికీ ఆదాయ భద్రత కల్పించడం ద్వారా ఆచార్య ఎన్‌.జి.రంగ ప్రధాన ఆకాంక్ష రైతు సంక్షేమం సాధించడంలో సహాయపడిన‌వార‌మౌతామ‌ని అన్నారు. వ్యవసాయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. సాంప్రదాయ జ్ఞానం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మధ్య మేళ‌వింపు అవ‌స‌ర‌మ‌న్నారు. వ్యవసాయ వర్సిటీలు రైతులకు ప్రయోజనం చేకూర్చే పరిశోధనలపై మ‌రింత‌ దృష్టి పెట్టాల‌న్నారు. రైతులు తమ కృషి ఫలాలను పొందేలా చూడాలని ఆయ‌న పేర్కొన్నారు.