శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 16:44:01

ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు అధికారుల కుట్ర: శివ‌సేన‌

ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు అధికారుల కుట్ర: శివ‌సేన‌

ముంబై: మ‌హారాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులు శివసేన నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారును కూల్చేందుకు కుట్ర చేస్తున్నార‌ని ఆ పార్టీ ఆరోపించింది. అధికారుల్లో కొందరు ప్ర‌భుత్వానికి శత్రువులుగా వ్య‌వ‌హరిస్తున్నార‌ని సామ్నా ప‌త్రిక వేదిక‌గా విమ‌ర్శ‌లు చేసింది. అధికారులు బీజేపీతో కుమ్మక్కై తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కుట్రలు చేస్తున్నార‌ని శివసేన మండిపడింది. అధికారులు ఇంకా ఫడ్న‌వీస్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న భ్రమల్లో ఉన్నారని, ప్రభుత్వంలోని కీలక శాఖల ఉన్న‌తాధికారుల‌తోపాటు పోలీస్‌ కమిషనర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల లాంటి కీలకమైన వారి అపాయింట్‌మెంట్లను ఆరెస్సెస్ ప్రభావితం చేస్తున్న‌ది విమ‌ర్శించింది. 

అయితే, తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్న అధికారుల వివరాలను ప్రస్తుతం చెప్పలేమని, తమ ప్రభుత్వాన్ని కూల్చాలని మాత్రం కొందరు అధికారులు ఆలోచిస్తున్నారని శివసేన ఆరోపించింది. ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌తో కలిసి బీజేపీ నిర్వహించిన ప్రమాణ స్వీకారం కొందరు అధికారుల అంగీకారంతోనే జరిగినట్లు తాము అనుమానిస్తున్నామని, తమతమ స్వార్థ ప్రయోజనాల కోసం పాత ప్రభుత్వమే కొనసాగాలని అధికారులు భావిస్తున్నారని సామ్నా దుయ్య‌బ‌ట్టింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.