ఆదివారం 05 జూలై 2020
National - Jun 27, 2020 , 17:54:45

ఉద్యోగాల సృష్టి ఉత్త ప్ర‌చార‌మే: ప‌్రియాంకాగాంధీ

ఉద్యోగాల సృష్టి ఉత్త ప్ర‌చార‌మే: ప‌్రియాంకాగాంధీ

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం చెబుతున్న ఉద్యోగాల సృష్టి ఉత్త ప్ర‌చార ఆర్భాటమేనని సోనియాగాంధీ త‌న‌య‌, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ విమ‌ర్శించారు. ప్ర‌చార ఆర్భాటాల‌తో ఉద్యోగాల సృష్టి జరగదని ఆమె ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా ఎద్దేవాచేశారు. 'ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్‌‌గార్ అభియాన్'ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన మరుసటి రోజే ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శుక్ర‌వారం ఉద్యోగితా ఈవెంట్ ఒకటి చాలా పెద్ద పబ్లిసిటీతో ప్రారంభించారని, ఉద్యోగాలిస్తామ‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న చాలా కేటగిరిలు ఏమాత్రం ఆరోగ్యకరంగా లేవని, ప్రభుత్వం నుంచి నేరుగా ఎలాంటి ఆర్థిక సహకారం లేక‌పోవ‌డంతో స్వయం ఉపాధి పొందుతున్న ప్రజలంతా సంక్షోభంలో ఉన్నారని ప్రియాంకాగాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. 

చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి దారుణంగా ఉందని, ఒక అంచనా ప్రకారం 62 శాతం ఎంఎస్ఎంఈలు ఉద్యోగాల్లో కోత పెట్టడమే కాకుండా వేతనాల్లో 78 శాతం కోత పెడుతున్నాయని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని చికాన్‌కారీ పరిశ్రమ, వడ్రంగి పని, ఇత్తడి పరిశ్రమ, యంత్రపు మగ్గాల పరిశ్రమ, తివాసీల పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని ఆమె తెలిపారు. 

ఉపాధి లేక‌పోవ‌డం, ఆర్థిక సమస్యలు తలెత్త‌డం లాంటి ప‌రిణామాల‌తో యూపీలో ఇటీవ‌ల విషాదకర ఆత్మహత్యా ఘటనలు వెలుగు చూశాయని ప్రియాంక విమర్శించారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతున్న‌ద‌ని, ఉద్యోగాలు క‌ల్పిస్తామంటూ ఆర్భాటంగా ప్ర‌చారాలు చేసుకుంటున్న‌ద‌ని, ప‌బ్లిసిటీతో ఉపాధి అవ‌కాశాలు లభిస్తాయా? అని ఆమె ప్ర‌శ్నించారు. logo