శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 16:30:43

యజమాని జీతం ఇవ్వలేదని ఉద్యోగి ఏం చేశాడో తెలుసా..?

యజమాని జీతం ఇవ్వలేదని ఉద్యోగి ఏం చేశాడో తెలుసా..?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫేక్‌ దొంగతనం జరిగింది. యజమాని జీతం ఇవ్వలేదన్న కారణంగా ఓ వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి దొంగతనం పేరుతో హైడ్రామా నడిపించాడు. యజమానికి చెందిన రూ.7.16 లక్షలను తానే నొక్కేసి దొంగలు ఎత్తుకెళ్లారని నాటకమాడాడు. పోలీస్‌ విచారణలో అసలు నిజం బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని టిగ్రీ ఏరియాకు చెందిన నరేష్‌ కుమార్‌ బైర్వా (37) ఒక ఆయిల్‌ కంపెనీలో కలెక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా రూ.7.16 లక్షల కలెక్షన్‌ వసూలు చేసిన బైర్వా.. ఆ మొత్తాన్ని యజమానికి అందజేయకుండా తన స్నేహితులు హరీష్‌ (28), జ్యోతిష్‌ (25)లకు ఇచ్చి పంపాడు.

ఆపై తాను నగదు తీసుకుని వస్తుండగా సిల్వర్‌ కలర్‌ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కుని పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే నిందితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించారు. సమోసా చౌక్‌ సమీపంలోని ఓ షాప్‌లో కలెక్షన్‌ తీసుకునే సమయంలో బైర్వాతోపాటు మరో ఇద్దరు ఉన్న విషయాన్ని గుర్తించారు. దీంతో బైర్వాను అనుమానించిన పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు. తన యజమాని లాక్‌డౌన్‌ పేరుతో జీతం ఇవ్వలేదని అందుకే ఈ పని చేశానని ఒప్పుకున్నాడు.  


logo