ఏనుగును ఢీకొట్టి పట్టాలు తప్పిన రైలు

భువనేశ్వర్: ఒడిశాలో ఏనుగును ఢీకొట్టిన రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏనుగు మరణించగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూరీ నుంచి సూరత్ వెళ్తున్న పూరీ-సూరత్ ఎక్స్ప్రెస్ రైలు సంబల్పూర్ జిల్లా భవానీపల్లి వద్ద ఓ ఏనుగును ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజన్ నాలుగు చక్రాలు పట్టాలు తప్పాయి. రైలు పట్టాలపై నిలిచిపోవడంతో రాకపోకాలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రైలు డీకొట్టడంతో ఏనుగు మృతిచెందిదని వెల్లడించారు. అయితే రైలులోని ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు.
ఇదే తరహా ప్రమాదం ఈనెల 6న కూడా జరిగింది. రూర్కెలా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఓ ఏనుగు మృతిచెందింది. భువనేశ్వర్ నుంచి రూర్కెలా వెళ్తున్న రైలు జుమురా సమీపంలోని గద్గబాగల్ బ్రిడ్జి వద్ద ఏనుగును ఢీకొట్టింది. ఆ ఏనుగుకు 10 నుంచి 12 ఏండ్ల వయస్సు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.