బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 02:25:30

బీహార్‌ యువతరంగం

బీహార్‌ యువతరంగం

  • రాష్ట్రంలో ఉద్ధండులకు చెమటలు పట్టిస్తున్న తేజస్వీయాదవ్‌
  • ప్రత్యేక శైలితో ఎన్నికల  ప్రచారంలో దూకుడు
  • ప్రజలతో నేరుగా సంభాషిస్తూ ప్రచారంలో కొత్త ఒరవడి
  • సీఎం నితీశ్‌ సభలకు మించి తేజస్వీకి ప్రజలు బ్రహ్మరథం

‘నితీశ్‌కుమార్‌ పాలనలో మీలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? రాలేదు.. రాలేదు (జనం అరుపులు). మీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలా? కావాలి.. కావాలి(ప్రజల నినాదాలు). అయితే నాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వండి.. నా మొదటి క్యాబినెట్‌ సమావేశమే చరిత్రాత్మకం అవుతుంది. మీకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాను’

-బీహార్‌లో ఓ భారీ ఎన్నికల ప్రచార సభలో వేదికపై ఉన్న ఓ యువ నాయకుడు.. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో జరిపిన సంభాషణ ఇది. ఆ యువకుడే రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు తేజస్వీ యాదవ్‌. ఆయన ప్రచార శైలే వేరుబీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాల రాజకీయ అనుభం ఉన్న నేతలు వివిధ పార్టీల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ.. 30 ఏండ్ల తేజస్వీ యాదవ్‌ ఒక్కడే రాష్ట్ర ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ లేకుండా జరుగుతున్న ఈ అసెంబ్లీ పోరులో ఆయన చిన్న కుమారుడు తేజస్వీయాదవ్‌ తన తండ్రిని మరిపిస్తున్నారు. ప్రతి సభలోనూ ప్రజలకు ప్రశ్నలు సంధించి ‘మాట- ముచ్చట’లాగా ప్రచారాన్ని మార్చివేస్తున్నారు. సోషల్‌మీడియాలోనూ అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటినుంచి రోజూ కనీసం 10-12 సభల్లో పాల్గొంటూ సుడిగాలిగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు తేజస్వీ. ఇప్పటికే 60 పైచిలుకు సభల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలు పూర్తయ్యేనాటికి 150 సభల్లో పాల్గొంటారని ఆర్జేడీ నేతలు చెప్తున్నారు.  

ఎన్నికల ఎజెండా సెట్‌ చేసిన యువనేత

బీహార్‌ ఎన్నికల్లో మొదట ఏ పార్టీకి స్పష్టమైన ఎజెండా లేదు. తేజస్వీనే ఈ ఎన్నికలకు గట్టి ఎజెండాను సెట్‌ చేశారు. యువతకు 10 లక్షల ఉద్యోగాలిస్తామని ఆయన ప్రకటించటం తో సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ కూటమి ఖంగు తిన్నది. అన్ని ఉద్యోగాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న సీఎం, నితీశ్‌కుమార్‌, డిప్యూటీ సీం, బీజేపీ నేత సుశీల్‌ కుమార్‌ మోదీకి  తేజస్వీ దీటుగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ బడ్జెట్‌ను నితీశ్‌ సర్కార్‌ 60 శాతమే ఖర్చు చేస్తున్నదని, మిగిలిన నిధులతో జీతాలిస్తామని ప్రకటించారు.10 లక్షల ఉద్యోగాలివ్వటమే అసాధ్యమని ఎద్దేవా చేసిన బీజేపీ, తేజస్వీ దెబ్బకు తన మ్యానిఫెస్టోలో ఏకంగా 19 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించటం గమనార్హం. 

ఒక్కటే ఫొటో.. అది తేజస్వీదే

బీహార్‌లో 1977 తర్వాత లాలూప్రసాద్‌ యాదవ్‌గానీ, ఆయన ఫొటోగానీ లేకుండా ఎన్నికలు జరుగలేదు. కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉండి ఎన్నికలకు దూరమయ్యారు. దాంతోపాటు ఆయన ఫొటో కూడా కనుమరుగైంది. ఆర్జేడీ ఎన్నికల ప్రచారంలో ఒక్క తేజస్వీయాదవ్‌ ఫొటో తప్ప ఎవ్వరి ఫొటో కనిపించటంలేదు. తేజస్వీ తల్లి, మాజీ సీఎం అయిన రబ్రీదేవి ఫొటో కూడా  ఏ ఒక్క సభలోనూ, పార్టీ పోస్టర్లపైనా కనిపించటంలేదు.