మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 16:52:51

మొక్కలు అమ్ముతున్న వృద్ధుడికి నెటిజెన్ల ఆసరా

మొక్కలు అమ్ముతున్న వృద్ధుడికి నెటిజెన్ల ఆసరా

బెంగళూరు : ఆలస్యంగానైనా అవసరమైన వారికి సాయం చేయడానికి ఇంటర్నెట్ దోస్తులు చేతులు కలుపుతున్నారు. మొన్న 'బాబా కా ధాబా'తో ప్రారంభమైన ఈ సాయం చేసే చేతులు.. ప్రస్తుతం బెంగళూరులో మొక్కలు అమ్ముతున్న వృద్ధుడికి ఆసరాగా నిలిచేవరకు వచ్చాయి. తన కడుపు నింపుకోవడంతోపాటు పర్యావరణాన్ని రక్షించాలన్న ఆశయంతో బెంగళూరు నగరంలోని కనకపుర రోడ్డులో మొక్కలు అమ్ముతున్న రేవణ సిద్దప్పగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు నెటిజెన్లు.

బెంగళూరు నగరంలోని కనకపుర రోడ్‌లో చిన్న మొక్కల దుకాణాన్ని రేవణ సిద్దప్ప నడుపుతున్నాడు. సరైన ఆవరణ లేకపోవడంతో ఆ వృద్ధుడు రోజంతా ఎండలో గొడుగేసుకుని కూర్చుండి నాలుగు రూపాయలు సంపాదించేందుకు కష్టపడుతున్నాడు. ఈ వృద్ధుడు పడుతున్న ఇబ్బందిని శుభం జైన్ అనే నెటిజెన్‌.. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో షేర్ చేశాడు. "సరక్కి సిగ్నల్ సమీపంలోని కనకపుర రోడ్ వద్ద మొక్కలను విక్రయించే రేవణ సిద్దప్ప అనే వృద్ధుడిని కలవండి. ఈ మొక్కల ధర రూ.10-30 లోపే. ఒక వైపు ఎండ నుంచి తనను తాను రక్షించుకోవడానికి గొడుగు పట్టుకున్నాడు" అని కామెంట్‌ రాశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో కనకపుర రోడ్డు చేంజర్స్‌ పేరిట ఏర్పాటైన ఓ నెటిజెన్‌ గ్రూప్‌.. రేవణ సిద్దప్పకు అండగా ఉండేందుకు ముందుకొచ్చారు. కూర్చోవడానికి కుర్చీ, మొక్కలు పెట్టుకునేందుకు టేబుల్‌, ఎండ నుంచి రక్షణగా పెద్ద గొడుగును అందించారు. అలాగే మరికొన్ని మొక్కలను కూడా అందించి అమ్ముకోవాలని సూచించారు. వృద్ధుడు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకోవడానికి నిధులు సేకరిస్తున్నాం.. ఎవరైనా తమకు తోచిన సాయం నేరుగా మాకు అందజేయవచ్చు అని గ్రూపు నిర్వాహకులు నెటిజెన్లకు విజ్ఞప్తిచేస్తున్నారు. బాబా కా ధాబా, రేవణ సిద్దప్ప సంఘటనలు.. మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉన్నదని నిరూపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.