గురువారం 04 జూన్ 2020
National - Feb 06, 2020 , 00:31:12

వృద్ధులకు డే కేర్‌ సెంటర్లు

వృద్ధులకు డే కేర్‌  సెంటర్లు
  • ఎన్జీవోలకు సంరక్షణ బాధ్యత
  • చట్టం తెస్తామన్న కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: ఒంటరిగా ఉండే వృద్ధుల సంరక్షణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)లకు అప్పగించే ఒక వినూత్న పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు తెలిపింది. ఇండ్లల్లో ఒంటరిగా ఉండే సీనియర్‌ సిటిజన్లకు ‘డే కేర్‌' సదుపాయం కల్పించేందుకు ఒక చట్టం చేస్తామని పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 10.38 కోట్ల మంది వయోవృద్ధులున్నారని సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి తావర్‌చంద్‌ గెహ్లాట్‌ రాజ్యసభలో చెప్పారు. ఒంటరిగా ఉండే వృద్ధుల సంరక్షణ కోసం ‘డే కేర్‌' కేంద్రాలు ప్రారంభించేందుకు ఒక కొత్త చట్టం చేస్తామని చెప్పారు. ఆ కేంద్రాలలో గ్రంథాలయం, క్యాంటీన్‌, ఇతర సదుపాయాలుంటాయని తెలిపారు. అలాగే ఒంటరిగా నివసిస్తున్న వయోవృద్ధుల బాధ్యతను ఎన్జీవోలకు అప్పగించే ఓ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. మరోవైపు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న పలువురు విపక్ష సభ్యులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనోద్యమాలను ప్రస్తావించారు. ఇదేఅంశంపై లోక్‌సభలో కాంగ్రె స్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ, ఎన్నార్సీ, సీఏఏ పేరిట ప్రభుత్వం పన్నిన కుట్రను ప్రజలు భగ్నం చేశారని చెప్పారు.


logo