బుధవారం 20 జనవరి 2021
National - Dec 22, 2020 , 14:02:38

యూకే నుంచి వచ్చిన ఎనిమిది మందికి పాజిటివ్‌

యూకే నుంచి వచ్చిన ఎనిమిది మందికి పాజిటివ్‌

న్యూఢిల్లీ : యూకేలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. దేశానికి వచ్చిన ప్రయాణికులు, సిబ్బందిలో ఎనిమిది మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారని ఓ అధికారి మంగళవారం తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారంతా గత రాత్రి యూకే నుంచి దేశానికి చేరిన వారు. లండన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో 266 మంది ప్రయాణికులు, సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. ఇందులో ఐదుగురు పాజిటివ్‌గా పరీక్షించారు. అలాగే చెన్నైకి వచ్చిన వారిలో ఒకరి, పశ్చిమబెంగాల్‌ వచ్చిన వారిలో ఇద్దరికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో నమూనాలను సేకరించి.. కొత్త కరోనా కొత్త జాతేనా? కాదా? అని తెలుసుకునేందుకు ఎన్‌సీడీసీకి పంపారు. అనంతరం వైరస్‌ సోకిన వారందరికీ సంరక్షణ కేంద్రాలకు తరలించారు. కరోనా కొత్త వైరస్‌ను కనుగొన్న నేపథ్యంలో యూకే నుంచి భారత్‌కు నడిచే విమాన సర్వీసులను డిసెంబర్‌ చివరి వరకు కేంద్రం నిషేధించింది.

ఈ క్రమంలో మంగళవారం పెద్ద ఎత్తున యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి భారత్‌కు చేరారు. వీరందరికీ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌ని అమృత్‌సర్‌ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున పరీక్షల కోసం క్యూలో బారులు తీరారు. అలాగే వారి కోసం వచ్చిన బంధువులతో విమానాశ్రయం కిక్కిరిసింది. ఇదిలా ఉండగా.. చెన్నైలో లండన్‌ నుంచి 14 మందిని పరిశీలనలో ఉంచారు. లండన్‌ ప్రయాణ సంబంధం ఉన్న 1088 పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. మరో వైపు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం స్వాస్థ భవన్‌లో కొత్త కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు సమావేశం అవుతుందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. యూకే నుంచి తిరిగి వచ్చిన విద్యార్థికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. అలాగే పలువురు విద్యార్థులు సైతం తిరిగి వచ్చిన వారిలో ఉన్నారు. అయితే కొత్త వైరస్‌ రోగులను ఎంత మేర ప్రభావితం చేస్తుందనే విషయం తెలియలేదని, బెలియాఘాటా ఐడీ హాస్పిటల్‌కు చెందిన అంటు వ్యాధుల నిపుణుడు యోగిరాజ్ రే చెప్పారు.


logo