బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 23, 2020 , 22:18:02

పంజాబ్‌ సీఎం కుమారుడికి ఈడీ సమన్లు

పంజాబ్‌ సీఎం కుమారుడికి ఈడీ సమన్లు

చండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కుమారుడు రణీందర్‌ సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న జలంధర్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని అందులో పేర్కొంది. కాగాచ రణీందర్‌ సింగ్‌ గతంలో కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. 2016 జూలై 16న ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. స్విట్జర్లాండ్‌కు నిధుల తరలింపు, జాకరాండా ట్రస్ట్, బ్రిటిష్ వర్జిన్ దీవులలో కొన్ని అనుబంధ సంస్థల ఏర్పాటుపై ఆరా తీశారు. 

మరోవైపు రణీందర్‌, సీఎం అమరీందర్‌ సింగ్‌పై నమోదైన మూడు కేసుల్లో ఐటీ ఫైళ్ల పరిశీలన కోసం సంబంధిత అధికారులు సెప్టెంబర్ 14 న ఒక దరఖాస్తు చేశారు. అయితే తొలుత దీనికి అనుమతించినప్పటికీ రణీందర్‌ దీనిపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ తనకు ఎలాంటి నోటీసు ఇవ్వనందున తనిఖీ చేసే అధికారం ఐటీ అధికారులకు లేదని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారుల పరిశీలన ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే రణీందర్‌ సింగ్‌కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఈడీ సమన్లను పరిశీలించి ఆ మేరకు స్పందిస్తామని ఆయన తరుఫు న్యాయవాది తెలిపారు. కాగా, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ ప్రభుత్వం సవరణ చట్టాలను చేయడం వల్లనే ఈడీ సమన్లు జారీ చేసిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.