సోమవారం 06 జూలై 2020
National - Jun 23, 2020 , 16:26:50

ఢిల్లీ అల్లర్ల కేసులో ఈడీ సోదాలు

ఢిల్లీ అల్లర్ల కేసులో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, నోయిడాలోని ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది. అల్లర్లకు నిధులు సమకూర్చారన్న ఆరోపణలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ) కింద మార్చిలో ఆప్‌ బహిష్కృత నేత తాహిర్ హుస్సేన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. రెండు నెలల సుదీర్ఘ విచారణలో, హుస్సేన్ 1.5 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.

చాంద్ బాగ్ ప్రాంతంతో సహా ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిపేందుకు సేకరించిన మొత్తాన్ని ఆయన సీఏఏ వ్యతిరేక నిరసనకారులకు చెల్లించనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అల్లర్లలో 50 మంది వరకూ మరణించారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన రెండు ఛార్జీషీట్లలో హుస్సేన్ పేరు ఉంది. ఢిల్లీలోని చాంద్ బాగ్ ప్రాంతంలో నిలిపి ఉన్న వాహనాలను ధ్వంసం చేసేందుకు అల్లరిమూకలు దారి తీశాయన్న నిందితుల్లో ఒకడిగా మొదటి ఛార్జీషీట్‌లో నమోదు చేశారు.

కరవాల్‌నగర్‌లో ఓ అల్లరిమూక ఒక గోడౌన్‌ను దోచుకున్న ఘటనలో రెండో ఛార్జీషీట్‌లో నిందితుడిగా పేర్కొంది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తాహిర్ హుస్సేన్‌ను విచారించేందుకు అనుమతి కోసం కోర్టుకు వెళతామని ఈడీ తెలిపింది.  హుస్సేన్‌పై ఐబీ అధికారి అంకిత్‌శర్మ హత్యపై విచారణ జరుగుతోంది. తాహిర్ హుస్సేన్ సోదరుడు షా ఆలంను కూడా క్రైం బ్రాంచ్, ఈశాన్య ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణ కోసం ఆయనను ఈడీ పిలిచే అవకాశం ఉంది. 


logo