ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 14:25:56

రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌ అన్నపై ఈడీ కేసు.. సోదాలు

రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌ అన్నపై ఈడీ కేసు.. సోదాలు

జైపూర్: ఎరువుల కుంభకోణానికి సంబంధించి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్న అగ్రసేన్ గెహ్లాట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించి ఢిల్లీ, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు జరిపింది. ఈ కుంభకోణానికి సంబంధించి రాజస్థాన్‌లో ఆరు, గుజరాత్‌లో నాలుగు, న్యూఢిల్లీలోని ఓ చోట, పశ్చిమ బెంగాల్‌లో రెండు చోట్ల తనిఖీ నిర్వహించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మాజీ ఎంపీ బద్రిరామ్ జఖర్ నివాసంలో దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఎగుమతుల్లో నిబంధనలను ఉల్లంఘించినందుకు కస్టమ్స్ విభాగం రూ .7 కోట్ల జరిమానా విధించిన అనుపమ్ కృషి అనే సంస్థ యజమాని అగ్రసేన్ గెహ్లాట్. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణంలో అగ్రసేన్‌ గెహ్లాట్‌ ప్రమేయం ఉందని, తన కంపెనీ సబ్సిడీ ఎరువులను ఎగుమతి చేసిందని గతంలో బీజేపీ ఆరోపించింది.  

ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలతో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి పైలట్‌, 18 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపులపై అనర్హత నోటీసులు పంపారు. అయితే, ఈ నోటీసును రాజస్థాన్ హైకోర్టులో సవాలు చేయగా, జూలై 24 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది.  ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ నాయకత్వానికి వ్యతిరేకంగా పైలట్ తిరుగుబాటు చేయగా, రెండు సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో అసమ్మతి నేతలకు స్పీకర్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే సచిన్ పైలట్ జూలై 14 న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రితో పాటు పీసీసీ పదవి నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం గెహ్లాట్‌ ఆరోపించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo