శుక్రవారం 05 జూన్ 2020
National - May 13, 2020 , 16:37:55

స్వయం ప్రతిపత్తి గల దేశాన్ని నిర్మించడానికే ఆర్థిక ప్యాకేజీ

స్వయం ప్రతిపత్తి గల దేశాన్ని నిర్మించడానికే ఆర్థిక ప్యాకేజీ

ఢిల్లీ : భారతదేశాన్ని స్వయం ప్రతిపత్తి గల దేశంగా నిర్మించడానికే ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నిన్న ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్‌ నేడు మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రధాని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఐదు మూల సూత్రాల ఆధారంగా ప్రధాని ప్రకటన చేశారన్నారు. దేశ ఆర్థికవృద్ధిని పెంచి స్వయం ఆధారిత భారత్‌ లక్ష్యంగా ప్యాకేజీని ప్రకటించారన్నారు. ఆత్మ నిర్భర భారత్‌కు ఐదు అంశాలను మూల స్తంభాలుగా పేర్కొన్నారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్‌ సూత్రాలు ఆత్మ నిర్భర భారత్‌కు మూల స్తంభాలుగా చెప్పారు. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకం అన్నారు. స్థానిక బ్రాండ్లకు అంతర్జాతీయ స్థాయి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.  

గత 40 రోజుల్లో మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. భారత్‌ స్వయంపూర్వకంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రధాని ఒక సమగ్రమైన దార్శనికతను దేశం ముందుంచారన్నారు. వివిధ స్థాయిల్లో సంప్రదించాకే ప్రధాని ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నో విధాలైన సంస్కరణలు అమలు చేసినట్లు చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ తమ ప్రభుత్వ సంస్కరణలకు మేలిమి ఉదాహరణ అన్నారు. 


logo