మంగళవారం 31 మార్చి 2020
National - Feb 10, 2020 , 02:21:57

ఆప్‌లో ఆందోళన

ఆప్‌లో ఆందోళన
  • తుది పోలింగ్‌ శాతం వెల్లడిలో ఈసీ జాప్యం
  • ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు
  • ఈసీ తీరుపై కేజ్రీవాల్‌ గరం
  • బీజేపీ ఆమోదం కోసం వేచి చూశారన్నడిప్యూటీ సీఎం సిసోడియా
  • ఎట్టకేలకు ఈసీ స్పందన.. 62.59 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తుది పోలింగ్‌ శాతాన్ని ప్రకటించడంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జాప్యం చేయడంపై అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఈసీ తీరు ఖచ్చితంగా దిగ్భ్రాంతికరం.. షాకింగ్‌' అని పేర్కొన్నారు. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయి ఒకరోజు దాటినా తుది పోలింగ్‌ శాతాలను ఈసీ ఎందుకు ప్రకటించలేదన్నది ఆశ్చర్యకరమని ఆదివారం ట్వీట్‌ చేశారు. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం ఈసీ ప్రతిస్పందించింది. 62.59 శాతం నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రణబీర్‌ సింగ్‌ తెలిపారు. అంతకుముందు తుది పోలింగ్‌ శాతం వెల్లడిపై ట్విట్టర్‌ వేదికగా కేజ్రీవాల్‌ స్పందిస్తూ ‘పోలింగ్‌ పూర్తయిన ఒకరోజైనా వారు (ఈసీ) ఎందుకు తుది పోలింగ్‌ శాతాలను ప్రకటించలేదు?’ అని ప్రశ్నించారు. చివరిగా ఈసీ శనివారం రాత్రి పోలింగ్‌ శాతం 61.46 నమోదైందని ప్రకటించింది. ‘బీజేపీ కార్యాలయం నుంచి తుది పోలింగ్‌ శాతం వివరాలు ఈసీకి అందలేదా?’ అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ప్రశ్నించారు.


 అంతకుముందు ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్‌ పూర్తయి ఒకరోజైనా తుది పోలింగ్‌ శాతాన్ని ఈసీ వెలువరించకపోవడంతో తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ‘ఒకవేళ ఈవీఎంలలో బీజేపీ ఏదైనా చేస్తుందా? అన్నది అనుమానంగా ఉన్నది. తెర వెనుక రహస్యంగా ఏదో మతలబు జరుగుతున్నది’ అని అన్నారు. ఆప్‌ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల వల్ల బీజేపీ.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సంజయ్‌సింగ్‌ రెండు వీడియోలతో ట్వీట్లు చేశారు. బాబర్‌పూర్‌ అసెంబ్లీ స్థాన పరిధిలోని సరస్వతి విద్యానికేతన్‌ స్కూల్‌లో పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంను రిజర్వు పోలీసు (బలగాల) భద్రత లేకుండానే ఒక అధికారి తీసుకెళుతున్న దృశ్యంతో కూడిన వీడియోను ట్యాగ్‌ చేశారు. ఇదే స్థానం పరిధిలో మరో కేంద్రంలో ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. మరో వీడియోలో బస్సు నుంచి బయటకు తెచ్చిన ఈవీఎంను ఓ వీధిలో మోసుకెళ్తుండటం కనిపిస్తున్నదని, ఇక్కడికి సమీపంలో ఈసీ కేంద్రాలు లేవని, దీనిపై ఈసీ దర్యాప్తు జరుపాలని సంజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈవీఎంల వెంట కొందరు అధికారులు చట్ట విరుద్ధంగా వెళుతున్నట్లు సమాచారం ఉందని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఢిల్లీలోని 30 స్ట్రాంగ్‌ రూమ్‌ కేంద్రాల బయట వలంటీర్ల నిఘా పెడుతామన్నారు.  


ఢిల్లీ ఎన్నికల్లో ఐదు శాతం తగ్గిన పోలింగ్‌  

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62.59% పోలింగ్‌ నమోదైందని ఢిల్లీ సీఈఓ రణ్‌బీర్‌సింగ్‌ మీడియాకు తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఐదు శాతం పోలింగ్‌ తగ్గిందన్నారు. తుది పోలింగ్‌ శాతాన్ని వెల్లడించడంలో జాప్యానికి అన్ని స్థానాల్లో పోలింగ్‌పై ఖచ్చితత్వం కోసం ప్రయత్నించడమే కారణమన్నారు.బాలిమరన్‌ స్థానంలో గరిష్ఠంగా 71.6%, ఢిల్లీ కంటోన్మెంట్‌లో కనిష్ఠంగా 45.4% పోలింగ్‌ నమోదైందన్నారు. 2015 ఎన్నికల్లో ఢిల్లీలో 67.47% పోలింగ్‌ జరిగింది.కాగా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు విఫలం అవుతాయని బీజేపీ నేత ఒకరు చెప్పారు. గడువు కంటే రెండు గంటలు ఎక్కువగా పోలింగ్‌ జరిగినప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను ఎలా నిర్దారిస్తారని ఆ నేత ప్రశ్నించారు. 


logo
>>>>>>