సోమవారం 30 మార్చి 2020
National - Feb 17, 2020 , 03:08:40

ఎక్కడినుంచైనా ఓటు!

ఎక్కడినుంచైనా ఓటు!
  • సరికొత్త సాంకేతికత అభివృద్ధికి ఈసీ కసరత్తు
  • ఐఐటీ-మద్రాస్‌తో జట్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: నిర్దేశిత పోలింగ్‌ బూత్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- మద్రాస్‌ (ఐఐటీ-ఎం)తో చేతులు కలిపినట్లు ఈసీకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నదని మరో అధికారి చెప్పారు. ‘బ్లాక్‌ చైన్‌' టెక్నాలజీతో ముడిపడిన ఈ ప్రాజెక్టు గురించి సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సందీప్‌ సక్సేనా వివరిస్తూ.. వైట్‌ లిస్టెడ్‌ ఐపీ డివైజ్‌లు, ప్రామాణిక ఇంటర్నెట్‌ లైన్లు, బయోమెట్రిక్‌ యంత్రాలు, వెబ్‌ కెమెరాతో కూడిన టూ-వే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పద్ధతి ఇదని చెప్పారు. అయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే ఓటర్లు ముందుగా నిర్ణయించిన సమయానికి నిర్దేశిత వేదికకు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇది ‘ఓట్‌ ఫ్రమ్‌ హోం’ (ఇంటి వద్ద నుంచే ఓటు) కాదని, ‘ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ డివైజ్‌ నుంచైనా’ ఓటు వేసేందుకు మరింత సమయం, అధునాతన సాంకేతికత అవసరం అని పేర్కొన్నారు. 


ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి..

అభివృద్ధి దశలో ఉన్న ఈ సరికొత్త ఓటింగ్‌ పద్ధతిని సక్సేనా వివరిస్తూ.. ‘ఉదాహరణకు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి. హైదరాబాద్‌ ఓటర్‌ ఢిల్లీలో ఉంటే.. అతడు ఓటు వేసేందుకు తన నియోజకవర్గానికి వెళ్లొచ్చు లేదా ఓటేయకుండా ఉండొచ్చు. ఇలాంటి వారికి నూతన విధానం ఉపయోగడనుంది. నగరంలో ఈసీ ముందుగానే ఏర్పాటుచేసిన నిర్దేశిత కేంద్రానికి నిర్దేశిత గడువులో వెళ్లి వారు ఓటేయవచ్చు’ అని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఓటర్లు ముందుగానే తమ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈసీకి చెందిన మరో ఉన్నతాధికారి స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఇది పరిశోధన-అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టు అని తెలిపారు. ఈ సాంకేతికత ‘ఓకే’ అని నిర్ధారణ అయిన తర్వాతే సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియ, ఎన్నికల చట్టాలు, నిబంధనల్లో మార్పుల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్లి ఓటేసే స్థోమత లేని వలస కార్మికులకు వారు పనిచేస్తున్న నగరం/పట్టణం నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించాలని వివిధ రాజకీయపార్టీలు ఎప్పటి నుంచో ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. 

 

ఎలా పనిచేస్తుంది?

ఈ ‘టూవే బ్లాక్‌ చెయిన్‌ రిమోట్‌ ఓటింగ్‌' పద్ధతిలో ఈసీకి చెందిన ‘ఎలక్టోలర్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ నెట్‌వర్క్‌ (ఈఆర్‌వో నెట్‌)’ ద్వారా బయోమెట్రిక్స్‌, వెబ్‌ కెమెరాలను ఉపయోగించి ఓటర్‌ గుర్తింపు జరుగుతుంది. గుర్తింపు పూర్తయిన తర్వాత బ్లాక్‌ చైన్‌ ఎనేబుల్డ్‌ ఈ-బ్యాలెట్‌ పేపర్‌ (స్మార్ట్‌ కాంట్రాక్ట్‌) జనరేట్‌ అవుతుంది. దాని ద్వారా ఓటు వేసిన అనంతరం బ్యాలెట్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి, బ్లాక్‌ చైన్‌ హ్యాష్‌ట్యాగ్‌ జనరేట్‌ అవుతుంది. ఆ తర్వాత ఈ హ్యాష్‌ట్యాగ్‌ నోటిఫికేషన్‌ను సంబంధిత భాగస్వామ్య పక్షాలకు (అభ్యర్థులు, రాజకీయ పార్టీలు) పంపడం జరుగుతుంది. ఈ ఎన్‌క్రిప్టెడ్‌ ఓట్లను ఎవరైనా డీక్రిప్ట్‌ చేశారా లేదా ట్యాంపర్‌ చేశారా అన్నది నిర్ధారించేందుకు ఓట్ల కౌంటింగ్‌కు ముందు మరోసారి వాటిని పరిశీలిస్తారు.


logo