శనివారం 11 జూలై 2020
National - Apr 05, 2020 , 06:46:34

ఈ నెలాఖరు వరకు ఈ-వే బిల్లుల గడువు చెల్లుబాటు

ఈ నెలాఖరు వరకు ఈ-వే బిల్లుల గడువు చెల్లుబాటు

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ నెలాఖరుదాకా ఈ-వే బిల్లుల చెల్లుబాటు గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా వైరస్‌ కట్టడి చర్యల మధ్య ఎక్కడి ట్రక్కులు అక్కడే రోడ్లపైనే నిలిచిపోయాయి. రాష్ర్టాల మధ్య సరుకు రవాణా చేసే ట్రక్కులకు ఈ-వే బిల్లులు తప్పనిసరి అవగా, ఇప్పుడున్న బిల్లుల గడువు కాలం మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 15 మధ్యే తీరిపోతున్నది. దీంతో ఏప్రిల్‌ 30దాకా వీటి గడువును పెంచుతూ మోదీ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రవాణా సరుకు విలువ రూ.50 వే లు దాటితే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ర్టానికి వెళ్లే వాహనాలు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఇన్‌స్పెక్టర్‌ ముందు ఈ-వే బిల్లుల్ని తప్పక చూపాల్సిందే. ఈ బిల్లుల గడువు ప్రతీ 100 కిలోమీటర్లకు ఒకరోజుగా ఉంటుంది. భారీ ట్రక్కులకైతే ప్రతీ 20 కిలోమీటర్ల దూరానికి ఒకరోజు గడువు వస్తుంది. ప్రస్తుతం 21 రోజుల లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా, ఈ నెల 14తో తొలగిపోనున్నది.

ట్యాక్స్‌పేయర్స్‌ కోసం..

టీడీఎస్‌ మినహాయింపు ఫారాల దాఖలు కోసం వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకు మరింత సమయాన్ని ఇచ్చింది ఆదాయం పన్ను (ఐటీ) శాఖ. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) కోసం ఫాం 15జీ, 15హెచ్‌లను జూన్‌ 30 వరకు దాఖలు చేయవచ్చన్నది.


logo