న్యూఢిల్లీ : బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఇటీవలే ముగించిన ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ దసరా సేల్ ఈవెంట్‌కు సన్నద్ధమవుతోంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సేల్ అక్టోబర్ 5న ప్రారంభమై 8న ముగుస్తుంది. ప్లస్ మెంబర్షిప్ కలిగిన వారు ఒక రోజు ముందే డీల్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. రానున్న దసరా సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ టీజర్ పేజ్‌ను పబ్లిష్ చేసింది. ప్రింటర్స్, మానిటర్స్, డీఎస్ఎల్ఆర్ కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు సహా పలు ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకూ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఈ కామర్స్ దిగ్గజం వెల్లడించింది. అయితే ఐఫోన్ 13పై గతంలో ప్రకటించిన డీల్ కొనసాగుతుందా అనే విషయంలో ఫ్లిప్‌కార్ట్ స్పష్టత ఇవ్వలేదు. టాప్ డీల్స్ బ్యానర్ కింద ఐఫోన్ ఎస్ఈ, ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ల ఇమేజ్‌లను ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్కు సంబంధించిన సేల్ పేజ్‌లో పొందుపరిచారు. ఐఫోన్ 13, ఐఫోన్ 12పైనా డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉండవచ్చని భావిస్తున్నారు.
టీవీలు, అప్లయన్సెస్‌పై 75 శాతం వరకూ తగ్గింపు ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ పేర్కొంది. 4కే అల్ట్రా హెచ్డీ టీవీ రూ 17,249 నుంచి లభిస్తాయి. స్మార్ట్ టీవీలు రూ 7199 ప్రారంభ ధర నుంచి లభిస్తాయని ఫ్లిప్‌కార్ట్ పబ్లిష్ చేసిన సేల్ పేజ్ వెల్లడించింది. సేల్‌లో పలు డివైజ్‌లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై పది శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.