ఆదివారం 05 జూలై 2020
National - Jun 24, 2020 , 15:34:23

ఎన్నిక‌ల వేళ క‌ప్ప‌దాట్లు కామ‌నే: ఆర్జేడీ

ఎన్నిక‌ల వేళ క‌ప్ప‌దాట్లు కామ‌నే: ఆర్జేడీ

ప‌ట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న‌ది. పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధంతోపాటు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి చేరిక‌లు, రాజీనామాల ప‌రంప‌ర కొన‌సాగుతున్న‌ది. తాజాగా ఆర్జేడీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేసి సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరారు. ఇదిలావుంటే కొద్ది రోజుల క్రితం జేడీయూకు చెందిన ఒక ఎమ్మెల్సీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. 

తాజా ప‌రిణామాల‌పై ఆర్జేడీ నేత‌, బీహార్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి తేజ‌స్వి యాద‌వ్ స్పందించారు. ఎన్నిక‌ల వేళ ఒక పార్టీ నుంచి మ‌రొక పార్టీలోకి నేత‌ల క‌ప్ప‌దాట్లు కామ‌నేన‌ని ఆయ‌న చెప్పారు. నేత‌లు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి మార‌కుండా ఎన్నిక‌లు ఎక్క‌డ జ‌రిగాయో చెప్పాల‌ని మీడియాను తేజ‌స్వి ప్ర‌శ్నించారు.  త‌మ పార్టీ నుంచి వెళ్లిపోయిన నేత‌ల గురించి మాట్లాడటానికి ఏమీ లేద‌ని, వారికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని అన్నారు. 

ఎన్నిక‌ల వేళ ప‌వ‌ర్‌లో ఉన్న పార్టీలు అధికారం నిల‌బెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాయ‌ని తేజ‌స్వి చెప్పారు. ఇటీవ‌ల త‌మ పార్టీలోకి జేడీయూ నుంచి ఒక నాయ‌కుడు వ‌చ్చాడ‌ని తెలిపారు. కాబ‌ట్టి ఇలాంటి క‌ప్ప‌దాట్లు కామ‌నే అని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, సీఎం నితీశ్ కుమార్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప‌నిచేస్తున్నార‌ని, ఆ ప్ర‌ణాళిక ఆయ‌న‌కు మాత్ర‌మే ఉప‌యోప‌డేలా ఉన్న‌ద‌ని తేజ‌స్వి విమర్శించారు. నితీశ్ చ‌‌ర్య‌ల‌తో బీహార్ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని ఆయ‌న‌ ఎద్దేవా చేశారు. 


     ‌


logo