శనివారం 30 మే 2020
National - May 17, 2020 , 16:33:01

ఓపెన్‌ బుక్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు వద్దు

ఓపెన్‌ బుక్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు వద్దు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా విద్యాసంస్థలు గత 56 రోజులుగా మూతపడ్డాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు మొగ్గుచూపగా.. మరికొన్ని నోట్స్‌ పంపి విద్యార్థులకు కావాల్సిన పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఓపెన్‌ బుక్‌ ఆన్‌లైన్‌ పరీక్షల విధానాన్ని తీసుకొచ్చారు. మూడు సెట్ల ప్రశ్నాపత్రాలు సిద్ధం చేయాలని విభాగాధిపతులకు లేఖలు కూడా అందాయి. ఇంట్లో కూర్చుండి సంబంధిత పరీక్షను బుక్స్‌ రెఫర్‌ చేసి, ఆన్‌లైన్‌లో నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకొని రెండు గంటల్లోగా ఆన్సర్‌ బుక్‌లెట్‌లను ఆన్‌లైన్‌లో యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది. 

అయితే, ఈ విధానం వల్ల ఎస్సీ, ఎస్టీలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చాలా నష్టపోతారని పలువురు యూనివర్సిటీ ప్రొఫెసర్లు విచారం వ్యక్తంచేశారు. ఈ విధానాన్ని నిలుపదల చేసే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నలుగురు ప్రొఫెసర్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. ఈ విధానం వల్ల విద్యార్థుల మధ్య వివక్ష ఏర్పడటమే కాకుండా యూనివర్సిటీ  విద్య ప్రైవేటీకరణ దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయని వారు విచారం వ్యక్తంచేశారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితులను చర్చించేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలోని ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఆదివారం సమావేశమైంది. విద్యార్థులు నష్టపోకుండా ఉండేలా నాలుగైదు సలహాలతో వీసీకి లేఖ అందజేయాలని డీయూఎస్‌యూ జనరల్‌ బాడీ మీటింగ్‌లో నిర్ణయించారు.


logo