కరోనా విస్తరిస్తున్న వేళ ఆన్లైన్ శిక్షణల జోరు పెరుగుతున్నది. దీంతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పలు కోర్సులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నది. సంగీతం, నృత్యం, నటనా రంగాల్లోనే కాకుండా సినిమా స్క్రిప్ట్ రచనలో ఫరెవర్ ఫెంటాస్టిక్ థియేటర్స్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నది. రెండు విడతల్లో చేపట్టిన ఆన్లైన్ శిక్షణ ద్వారా వందల మందికి స్క్రిప్ట్ రాయడంలో మెళకువలు నేర్చుకున్నారు. మరోవైపు సినిమా రంగంలోని 24 క్రాప్ట్స్ను అనుసంధానం చేస్తూ డైరెక్షన్ చేసే విధానంపై ఆన్లైన్ శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు 9346645411 నంబర్లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.
24 క్రాఫ్ట్స్‌కు సంబంధించి సినిమా డైరెక్షన్‌పై అందించే శిక్షణలో ప్రధానంగా కెమెరామెన్‌కు డైరెక్టర్ షాట్ ఎలా చెప్పాలి? ఆర్ట్ డైరెక్టర్తోఎట్లా మాట్లాడాలి? మేకప్ ఎట్లుండాలి? ఆర్టిస్ట్ ఎంపిక? నటన? ఏ స్క్రిప్ట్‌కు ఎలాంటి డైలాగ్స్ రాయించాలి? వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. అంతేకాక ఎడిటింగ్, డబ్బింగ్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ విధానాలు, ప్రీ పొడక్షన్లో కథ, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్ల ఎంపిక, ప్రొడక్షన్లో షూటింగ్ చేసే విధానం.. ఏ కథకు ఎంత బడ్జెట్ అన్న అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఆఫ్లైన్లోనూ మూడు రోజుల పాటు ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్, సత్యజిత్ రే ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సీనియర్ దర్శకుల సహకారం తీసుకోనున్నారు.