బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 18:41:14

సైన్యంలోకి త్వరలో రెండు మూపురాల ఒంటెలు

సైన్యంలోకి త్వరలో రెండు మూపురాల ఒంటెలు

లేహ్ : సైన్యంలో సేవలందించేందుకు రెండు మూపురాల ఒంటెలు సిద్ధమవుతున్నాయి. తూర్పు లడఖ్‌లోని భారత్- చైనా సరిహద్దులో దళాలు పెట్రోలింగ్ చేయడానికి వీటిని త్వరలో భారత సైన్యంలో చేర్చబోతున్నారు.  వీటి సంఖ్యను పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

తూర్పు లడఖ్ ప్రాంతంలో 17,000 అడుగుల ఎత్తులో 170 కిలోగ్రాముల భారాన్ని మోయగల రెండు మూపురాల ఒంటెలపై లేహ్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిశోధనలు నిర్వహించింది. రెండు మూపురాలున్న ఒంటెలు ఒక మూపురం ఒంటెలకన్నా ఎక్కువ కాలం నీరు, ఆహారం లేకుండా ఉండగలవని గుర్తించారు. మూడు రోజుల వరకు ఇవి ఆహారంగానీ, తాగునీరుగానీ లేకుండా జీవించగలవు. దాంతో ఇప్పుడు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ (డీహార్) ఈ రకం ఒంటెల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించింది.

"మేము డబుల్ హంప్ ఒంటెలపై పరిశోధనలు చేస్తున్నాం. ఈ ఒంటెల యొక్క ఓర్పు, ఎక్కువ బరువు మోసే సామర్థ్యంపై పరిశోధనలు జరిపాం. తూర్పు లడఖ్ ప్రాంతంలో పరిశోధనలు చేసాం. చైనా సరిహద్దు సమీపంలో 17,000 అడుగుల ఎత్తు, 170 కిలోల భారాన్ని మోయగలవని గుర్తించాం. ఈ భారంతో అవి 12 కిలోమీటర్ల వరకు పెట్రోలింగ్ చేయవచ్చు" డీఆర్‌డీవో శాస్త్రవేత్త ప్రభు ప్రసాద్ సారంగి తెలిపారు. "ఈ రకం ఒంటెలను త్వరలో సైన్యంలోకి చేర్చనున్నారు. ఈ జంతువులకు తక్కువ జనాభా ఉన్నందున సంతానోత్పత్తి జరిపి వాటి సంఖ్యలను పెంచిన తర్వాత వాటిని సైన్యంలో చేర్చుకుంటారు" అని సారంగి తెలిపారు. భారతీయ సైన్యం సాంప్రదాయకంగా 40 కిలోల భారాన్ని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రాంతపు పుట్టలు, గుర్రాలను వినియోగిస్తుంది.


logo