గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 01:55:25

భారత్‌కు ఒరిగేదేమీ లేదు

భారత్‌కు ఒరిగేదేమీ లేదు
  • ఎలాంటి సానుకూల సంకేతాలు లేవు: ఆనంద్‌ శర్మ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన పట్ల భారత్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదని, ఎలాంటి సానుకూల సంకేతాలు లేవని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ విమర్శించారు. ‘ట్రంప్‌ పర్యటన వల్ల భారత్‌కు ఒనగూరే ప్రయోజనాలపై ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల సంకేతాలు కనిపించలేదు. రక్షణ, భద్రతా పరంగా సహకారం కొనసాగే అవకాశమున్నది. అంతరిక్షం, నూక్లియర్‌ సైన్స్‌లోనూ మన సహకారం కొనసాగుతుంది. ఒక్క హెలికాప్టర్ల ఒప్పందం తప్ప కొత్తగా ఏమీ ఉండబోదు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా చేస్తున్న ప్రతికూల వ్యాఖ్యల ద్వారా వాణిజ్య ఒప్పందం లేదా జీఎస్పీ పునరుద్ధరణ జరిగే అవకాశం కనిపించడం లేదన్నారు. 

   మరోవైపు కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా మాట్లాడుతూ  ట్రంప్‌ ‘అమెరికా ఫస్ట్‌' అని నినదిస్తుంటే.. ‘భారత్‌ ఫస్ట్‌'పై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో 85 వేల హెచ్‌1బీ వీసాల్లో భారతీయ ఐటీ నిపుణులు 70 శాతం పొందేవారని, ప్రస్తుతం అమెరికా వలస విధానంలో ఆంక్షల వల్ల 2015లో 6 శాతం వీసా దరఖాస్తులు తిరస్కరణ కాగా 2019 నాటికి అది 24 శాతానికి చేరిందన్నారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో అమెరికా నుంచి చౌకగా ముడి చమురును దిగుమతి చేసుకునే అవకాశమున్నదా అని ప్రశ్నించారు. 3 బిలియన్‌ అమెరికా డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను అమెరికాతో భారత్‌ చేసుకుంటుండగా, భారత్‌ ఉక్కు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు ఎందుకని నిలదీశారు. లక్షలాది మందితో ట్రంప్‌కు ఘనంగా స్వాగతం పలికే ప్రధాని మోదీ, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను ట్రంప్‌తో ప్రస్తావించాలని సుర్జేవాలా కోరారు. 


logo