మంగళవారం 31 మార్చి 2020
National - Feb 25, 2020 , 02:55:23

నూలు వడికిన అమెరికా అధ్యక్షుడు

నూలు వడికిన అమెరికా అధ్యక్షుడు
  • సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్‌ దంపతులు
  • ‘మూడు కోతుల’ ప్రతిమను బహూకరించిన మోదీ

అహ్మదాబాద్‌: ట్రంప్‌ దంపతులు సోమవారం గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమం వద్ద వారికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. గాంధీజీ బస చేసిన గదిని ట్రంప్‌ దంపతులకు చూపించారు. భారత స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా 1917 నుంచి 1930 వరకు గాంధీజీ ఈ ఆశ్రమంలోనే ఉన్నారని, స్వాతంత్య్ర పోరాటంతో ఈ ఆశ్రమానికి ఎనలేని అనుబంధం ఉన్నదని మోదీ వివరించారు. తర్వాత ట్రంప్‌, మెలానియా చరఖాను తిప్పి దారం వడికారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో ట్రంప్‌ తన సందేశాన్ని రాశారు. ‘సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడం అద్భుతం. ఇందుకుగాను నా ప్రియమిత్రుడు మోదీకి ధన్యవాదాలు’ అని రాసి సంతకం చేశారు. మెలానియా కూడా సంతకం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ దంపతులకు ప్రధాని మోదీ మూడు కోతుల ప్రతిమను బహుమతిగా అందజేశారు. ఆశ్రమం సభ్యుడు కార్తికేయ సారాభాయ్‌.. ట్రంప్‌ దంపతులకు గాంధీజీ ఆత్మకథ పుస్తకాన్ని అందజేశారు. 1947లో గాంధీజీ ప్రజలకు ఇచ్చిన ఓ స్ఫూర్తిదాయక సందేశాన్ని ఖద్దరు వస్త్రంపై ముద్రించి దాన్ని ఫ్రేమ్‌ కట్టి ట్రంప్‌ దంపతులకు బహుమతిగా ఇచ్చారు. మూడు చేనేత టవళ్లు , పెన్సిల్‌తో గీసిన గాంధీ చిత్రాలు కూడా బహుమతుల్లో ఉన్నాయి. ట్రంప్‌ దంపతులు దాదాపు 15 నిమిషాలపాటు ఆశ్రమంలో గడిపారు.

గాంధీజీ ప్రస్తావన ఏదీ?

సందర్శకుల పుస్తకంలో గాంధీజీ పేరును ట్రంప్‌ ప్రస్తావించకపోవడంపై నెటిజన్లు ట్విట్టర్‌లో విమర్శిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా గతంలో భారత్‌ను సందర్శించినప్పుడు గాంధీజీ గురించి రాసిన సందేశంతో ట్రంప్‌ సందేశాన్ని పోలుస్తున్నారు. కాగా, అసలు ట్రంప్‌కు గాంధీజీ ఎవరో తెలుసా? అని కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ  ప్రశ్నించారు. 


logo
>>>>>>