బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 17:16:08

‘టిక్‌టాక్‌’కు ట్రంప్ డెడ్‌లైన్‌!

‘టిక్‌టాక్‌’కు ట్రంప్ డెడ్‌లైన్‌!

న్యూఢిల్లీ: చైనా దేశానికి చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ ‘టిక్‌టాక్‌’కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  డెడ్‌లైన్ విధించారు. అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ లేదా మ‌రేదైనా పెద్ద కంపెనీకి సెప్టెంబ‌ర్ 15లోగా టిక్‌టాక్‌ను విక్ర‌యించాల‌ని, లేదంటే సెప్టెంబ‌ర్‌ 15 నుంచి త‌మ దేశంలో టిక్‌టాక్‌ను నిషేధిస్తామ‌ని ట్రంప్ ప్ర‌క‌టించారు. టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇస్తున్న‌ట్లు తెలిపారు. 

సెప్టెంబర్ 15 లోపు టిక్‌టాక్ విక్ర‌యంపై ఏదో ఒక‌టి తేల్చుకోవాల‌ని లేదంటే నిషేధం తప్పదని ట్రంప్‌ స్పష్టం చేశారు.  మైక్రోసాఫ్ట్ లేదా మరో పెద్దసంస్థ ఏది టిక్‌టాక్‌ను కొనుగోలు చేసినా తనకు అభ్యంతరం లేదని, అయితే అది సురక్షితమైన అమెరికన్ సంస్థ అయి ఉండాలని అని ట్రంప్ పేర్కొన్నారు. భద్రతతో తమకు ఎటువంటి సమస్య ఉండకూడదన్నారు. అదేవిధంగా ఈ ఒప్పందం ద్వారా అమెరికా ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటున్న‌దని కూడా ట్రంప్‌ చెప్పారు. 

ఇదిలావుంటే, టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా ముగిస్తామ‌ని, సమాచార భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటామని మైక్రోసాఫ్ట్ స్ప‌ష్టంచేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo