శనివారం 16 జనవరి 2021
National - Jan 13, 2021 , 01:54:59

గోప్యత గోప్యమే

గోప్యత గోప్యమే

  • ప్రైవసీ పాలసీ మార్పుపై భయాలు వద్దు
  • వాట్సాప్‌ నష్టనివారణ ప్రకటనలు
  • అయినా నమ్మని వినియోగదారులు
  • దూసుకుపోతున్న సిగ్నల్‌, టెలిగ్రామ్‌ యాప్‌ల డౌన్‌లోడ్లు

న్యూఢిల్లీ: 200 కోట్ల మంది వినియోగదారులు.. తనతో పోటీకి నిలబడగలవాడే లేడన్న ధీమా.. ఏం చేసినా చెల్లుతుందన్న అతి.. ఇదీ వాట్సాప్‌ నూతన ప్రైవసీ పాలసీ వెనుక ఉన్న ధైర్యం.. కానీ  పరిస్థితి అడ్డం తిరిగింది. మీ సమాచారాన్ని వాడుకొంటాం.. అమ్మేసుకొంటాం అనగానే యూజర్లు ఒప్పేసుకొంటారనుకొన్న సంస్థ అధిపతి మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆలోచన ఘోరంగా తప్పింది. ప్రైవసీపై రాజీ పడేది లేదంటూ లక్షల మంది యూజర్లు వాట్సాప్‌ను వదిలి సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వైపు మొగ్గారు. దాంతో వాట్సాప్‌ యాజమాన్యం నష్టనివారణ చర్యలు చేపట్టింది. కొత్త పాలసీతో యూజర్ల గోప్యతకు ఎలాంటి ఆటంకం ఏర్పడదని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నది. 

సుదీర్ఘ వివరణ

తమ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల కుటుంబ సభ్యులు, మిత్రులతో వాట్సాప్‌ ద్వారా పంచుకొనే సమాచారాన్ని చదువబోమని సంస్థ యాజమాన్యం వివరణ ఇచ్చింది. వాట్సాప్‌ ద్వారా వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు చేసే వారి వివరాలు మాత్రమే సేకరిస్తామని పేర్కొంది. అదికూడా వినియోగదారుడి అనుమతి పొందిన తర్వాతే డాటా స్టోర్‌ చేస్తామని వివరించింది. వాట్సాప్‌ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వాణిజ్యపరంగా ఫేస్‌బుక్‌ తదితర సంస్థలకు బదలాయించబోమని స్పష్టంచేసింది. 

ఐదు రోజుల్లో అనూహ్యంగా...

నూతన గోప్యత విధానంపై గుర్రుగా ఉన్న వినియోగదారులు.. టెలిగ్రాం, సిగ్నల్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నెల 6 నుంచి 10 వరకు మన దేశంలో సిగ్నల్‌ యాప్‌ను 23 లక్షల మంది  ఇన్‌స్టాల్‌ చేసుకొన్నారు. ఐదు రోజుల్లో టెలిగ్రామ్‌ను 13 లక్షల మంది ఇన్‌స్టాల్‌ చేసుకొన్నారని సెన్సార్‌ టవర్‌ డాటా సంస్థ తెలిపింది. ఈ నెల 1 నుంచి 5 వరకు టెలిగ్రామ్‌ డౌన్‌లోడ్లు 13 లక్షలు ఉండగా, సిగ్నల్‌ను 24 వేల మంది మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకొన్నారు. కానీ, ఆ తర్వాత ఐదు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. 6 నుంచి 10 మధ్య సిగ్నల్‌ డౌన్‌లోడ్లు ఏకంగా 9,483 శాతం పెరిగాయి. ఇదే సమయంలో వాట్సాప్‌ డౌన్‌లోడ్లు 35 శాతం పడిపోయాయి.