శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 02:26:33

‘రాజధర్మం’పై రగడ

‘రాజధర్మం’పై రగడ
  • మీరా.. మాకు బోధించేది?
  • సోనియాపై రవిశంకర్‌ మండిపాటు
  • మీ చరిత్ర తప్పులతడక

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు. ‘రాజధర్మం’ గురించి తమకు బోధించవద్దన్న ఆయన, మీ చరిత్ర తప్పులతడకని విమర్శించారు. ఈశాన్య ఢిల్లీలో మతపరమైన అల్లర్లను అదుపుచేయడంలోనూ, తన విధులను నిర్వర్తించడంలోనూ విఫలమైన కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోనియా నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు ఓ వినతిపత్రం అందజేశారు. తమ ప్రభుత్వ హయాంలో ‘రాజధర్మాన్ని’ పాటించామని, దేశంలోని అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను గౌరవించి వారిని రక్షించామని గుర్తుచేశారు. దీనిపై రవిశంకర్‌ స్పందిస్తూ.. ‘సోనియా గాంధీ, దయచేసి రాజధర్మం గురించి మాకు బోధించొద్దు. మీ చరిత్ర అంతా తప్పులతడక’ అని అన్నారు.‘కాంగ్రెస్‌ ఏదైనా చేస్తే అది మంచిది. అదే మేంచేస్తే ప్రజలను రెచ్చగొడతారు.ఇది ఎలాంటి రాజధర్మం?’ అని ప్రశ్నించారు. 


మీది విభజన మనస్తత్వం

ఇందిరా గాంధీ, మన్మోహన్‌ది సమానత్వం, మతసామరస్యం కోరే రాజధర్మమని, బీజేపీది విభజన మనస్తత్వమని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. సోనియాపై కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చేసిన విమర్శలను ఆ పార్టీ ఖండించింది. ‘ఇందిరా జీ, రాజీవ్‌ జీ, మన్మోహన్‌ సింగ్‌ జీ అనుసరించినదే ‘రాజధర్మం’ సమానత్వం, మతసామరస్యానికి ఆ ‘రాజధర్మం’ ప్రాధాన్యతనిచ్చింది’ అని ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ పేర్కొంది. ఢిల్లీలో అల్లర్లకు ప్రతిపక్షం ప్రోద్బలమే కారణమన్న రవిశంకర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ స్పందించారు. ‘ఎన్నార్సీ తప్పుడు నిర్ణయమని మళ్లీ చెబుతున్నా. దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చేయండి. స్వేచ్ఛగా మాట్లాడనివ్వని, శాంతియుతంగా నిరసనలు తెలుపనివ్వని దేశంలో మనం జీవించాల్సిరావడం సిగ్గుపడాల్సిన విషయం’ అని వ్యాఖ్యానించారు. 


logo