సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 18:10:13

ఆక్స్‌ఫర్డ్‌ టీకా అభివృద్ధిలో ముందడుగు!

ఆక్స్‌ఫర్డ్‌ టీకా అభివృద్ధిలో ముందడుగు!

న్యూ ఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నివారణ కోసం ఇప్పడొక టీకా కావాలి. ఇప్పటికే ఎన్నో దేశాలు ఈ దిశగా కృషిచేస్తున్నా ఆక్స్‌ఫర్డ్‌ టీకా కొత్త ఆశలు రేపుతున్నది. ఇప్పటికే మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాగా, రెండు, మూడో దశ కోసం మన దేశంలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సిద్ధమవుతోంది. ఈ మేరకు 2/3వ దశ మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంది. దేశీయ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో కలిసి ఎస్‌ఐఐ ఈ టీకాను అభివృద్ధి చేస్తున్నది. 

‘కొవిషీల్డ్‌’గా పేర్కొంటున్న ఈ టీకా భద్రత, రోగనిరోధక శక్తి పెంపొందిస్తుందా? అనేది ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో యాదృచ్చిక నియంత్రిత అధ్యయనం చేస్తారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి పేర్కొన్నారు. కాగా, గతవారం ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ఈ టీకా పురోగతిపై సంతృప్తిని వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా తయారీదశలో ఉన్న డజన్లకొద్దీ టీకాల్లో ఇది ప్రముఖమైనదని పేర్కొంది. అక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసిన ఈ టీకా అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, ఇమ్యునోజెనిక్‌గా కనిపించిందని లాన్సెట్ మెడికల్ జర్నల్ పేర్కొంది.  1,077 మందిపై టీకాను ప్రయోగించగా, వారిలో కరోనాను తట్టుకునే యాంటీబాడీస్, తెల్లరక్తకణాలు తయారయ్యాయని వివరించింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo