బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 01:13:40

25 నుంచి దేశీయ విమాన సర్వీసులు

25 నుంచి దేశీయ విమాన సర్వీసులు

దశల వారీగా పునఃప్రారంభం

కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురి 

న్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులను ఈ నెల 25 నుంచి దశలవారీగా పునఃప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి బుధవారం వెల్లడించారు. అయితే అంతర్జాతీయ సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్నది మాత్రం ఆయన తెలుపలేదు. కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ‘దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి దశలవారీగా పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు సిద్ధమవ్వాలని అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు సమాచారమిచ్చాం’ అని హర్దీప్‌సింగ్‌ పురి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రయాణికులకు సంబంధించిన విధివిధానాలను విమానయాన శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుందని చెప్పారు. కరోనా నియంత్రణకు భారత్‌తోపాటు అనేక దేశాలు దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేయడంతో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో నష్టాల నుంచి గట్ట్టెక్కేందుకు పలు విమానయాన సంస్థలు ఉద్యోగులను తొలిగించడం, వేతనాల్లో కోతవేయడం వంటి చర్యలకు దిగాయి.


logo