గురువారం 22 అక్టోబర్ 2020
National - Aug 07, 2020 , 01:37:44

ఆక్రమణ నిజమే!

  ఆక్రమణ నిజమే!

  • చైనా బలగాలు భారత్‌లోకి వచ్చాయి
  • రక్షణశాఖ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్‌
  • రెండు రోజుల తర్వాత తొలగింపు

న్యూఢిల్లీ: మే నెలలో చైనా బలగాలు భారత్‌లోకి చొచ్చుకువచ్చాయని రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ‘చైనీస్‌ అగ్రెషన్‌ ఆన్‌ ఎల్‌ఏసీ’ పేరిట డాక్యుమెంట్‌ను తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. మే 5వ తేదీ నుంచి వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద, ముఖ్యంగా గల్వాన్‌ లోయలో చైనా సైనిక కార్యకలాపాలు పెరిగాయని అందులో పేర్కొన్నది. మే 17 వ తేదీ నాటికి చైనా సైన్యం గోగ్రా, ప్యాంగాంగ్‌ సరస్సు వద్దకు చేరాయని తెలిపింది. దీనిపై జూన్‌ 6న కమాండర్ల మధ్య భేటీ జరిగిందని డాక్యుమెంట్‌లో పేర్కొన్నది. అయితే డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌ చేసిన రెండు రోజుల అనంతరం గురువారం ఆ డాక్యుమెంట్‌ను వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. ఇరుదేశాల మధ్య ఉద్రికత్తలు ప్రారంభమైన తర్వాత చైనా వైఖరిపై రక్షణ శాఖ వెలువరించిన మొట్టమొదటి అధికార పత్రం ఇదే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తాలన్న చైనా ప్రయత్నాన్ని భారత్‌ తిప్పికొట్టింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది.

ప్యాంగాంగ్‌ నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తి లేదు

ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితి పునురుద్ధరణలో భాగంగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు అసంపూర్ణంగానే ముగిశాయి. ప్యాంగాంగ్‌ నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని భారత్‌ చైనాకు తేల్చి చెప్పింది. ఫింగర్‌3 ప్రాంతంలోని ధన్‌సింగ్‌ థాపా పోస్టు నుంచి భారత్‌ వెనక్కు వెళ్లాలని చైనా పట్టుపడుతున్నది. తాము ఫింగర్‌ 8 వరకు వెళ్తామని ప్రతిపాదిస్తున్నది. అయితే ఫింగర్‌ 3 ప్రాంతం భారత సరిహద్దులోనే ఉన్నదని భారత్‌ స్పష్టం చేసింది. అంతకు ముందు భారత్‌ పెట్రోలింగ్‌ నిర్వహించిన ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం చైనా బలగాలు ఉండటం గమనార్హం. 

ఖండాంతర క్షిపణులను పరీక్షించిన చైనా

బీజింగ్‌: భారత్‌, అమెరికాతో ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్న చైనా ఇటీవల ఖండాతర క్షిపణి పరీక్షలను నిర్వహించింది. రెండు క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్టు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌(పీఎల్‌ఏఆర్‌ఎఫ్‌) ప్రకటించింది. ఈ క్షిపణులు 4 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలవు. అమెరికా తన ఖండాంతర క్షిపణి ఎల్జీమ్‌-30 మినట్‌మాన్‌ను పరీక్షించిన కొద్ది రోజుల్లోనే చైనా క్షిపణి పరీక్షలు నిర్వహించడం గమనార్హం.

చైనాపై నిఘాకు 6 ఉపగ్రహాలు కావాలి:కేంద్రాన్ని కోరుతున్న సైన్యం

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకు ప్రత్యేకంగా 4-6 ఉపగ్రహాలు అవసరమని భారత సైనిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోకి చైనా భారీగా బలగాలను తరలించిన నేపథ్యంలో ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపాయి.


logo