సోమవారం 30 మార్చి 2020
National - Mar 23, 2020 , 00:48:48

సరిలేరు మీకెవ్వరూ!

సరిలేరు మీకెవ్వరూ!

-డాక్టర్లు, వైద్యసిబ్బందికి ప్రపంచవ్యాప్తంగా జనం జేజేలు

- ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్యసేవలు

న్యూఢిల్లీ: మానవాళికి పెనుముప్పుగా మారిన కరోనాపై ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న పోరాటం మాటల్లో చెప్పలేనిది. మొక్కవోని ధైర్యంతో వైరస్‌ సోకిన వారికి  వీళ్లు అన్ని వేళలా చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్లతోపాటు వైద్యసిబ్బంది కూడా వైరస్‌ బారిన పడి మరణిస్తున్నారు. చైనాలో కొత్త వైరస్‌ పుట్టుక గురించి సామాజిక మాధ్యమాల్లో అప్రమత్తం చేసి జైలు పాలైన డాక్టర్‌ లీ వెన్లియాంగ్‌ అనంతరం కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో వైరస్‌ బారిన పడి చనిపోయారు.ప్రపంచవ్యాప్తంగా సుమారు 29 శాతం మంది వైద్యసిబ్బందికి కరోనా సోకినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క చైనాలోనే 3,300 మందికిపైగా వైద్య సిబ్బంది కరోనా బారినపడగా 12 మంది మరణించారు. అమెరికాలోనూ 50 మంది వైద్యసిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. తాజాగా ఫ్రాన్స్‌లోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడు చనిపోయినట్లు ఆ ప్రభుత్వం ధ్రువీకరించింది. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది మాత్రం తమ విశ్వాసాన్ని ఏ మాత్రం సడలనీయడం లేదు. ఏదో రోజున ఈ మహమ్మారిపై పైచేయి సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. logo