సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 02:25:57

హెర్డ్‌ ఇమ్యూనిటీని నమ్ముకోవద్దు

హెర్డ్‌ ఇమ్యూనిటీని నమ్ముకోవద్దు

  • భారత్‌ వంటి దేశాలకు అది పరిష్కారం కాదు
  • రోగనిరోధకత పెరిగేలోపు తీవ్రనష్టం జరుగొచ్చు
  • ప్రజలు రక్షణ చర్యలు పాటించటమే ఏకైక మార్గం
  • కేంద్ర ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక 

న్యూఢిల్లీ, జూలై 30: కరోనా వైరస్‌ను ఎదుర్కోవటంలో సామూహిక రోగనిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ) వ్యూహాత్మక పరిష్కారం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ విధానం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేవరకు అందరూ స్వీయక్రమశిక్షణతో జాగ్రత్తగా ఉండాలని గురువారం సూచించింది. భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో సామూహిక రోగనిరోధకత వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక అధికారి రాజేశ్‌భూషణ్‌ తెలిపారు. ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ అనేది కరోనా వంటి వ్యాధులను ఎదుర్కోవటంలో పరోక్ష రక్షణ మాత్రమే. గత వ్యాధుల కారణంగాగానీ, వ్యాక్సినేషన్‌ వల్లగానీ పౌరుల్లో రోగనిరోధకత పెరుగుతుంది. భారత్‌వంటి అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో సామూహిక రోగనిరోధకత వ్యూహాత్మక అవకాశంగా ఉండదు. సామూహిక రోగనిరోధకత ఏర్పడాలంటే లక్షలమందికి వైరస్‌ సోకాలి. అందులో అనేకమంది దవాఖాన పాలవుతారు. ఎంతోమంది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది’ అని రాజేశ్‌భూషణ్‌ తెలిపారు. అయితే, ఇప్పట్లో కాకపోయినా సుదూర భవిష్యత్తులో భారతీయుల్లో కరోనాను నిరోధించగల సామూహిక రోగనిరోధకత ఏర్పడవచ్చని ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు, కరోనాకు వ్యతిరేకంగా హెర్డ్‌ ఇమ్యూనిటీ దేశంలోని కొన్ని సామాజిక, ఆర్థికవర్గాల్లోనే ఏర్పడే అవకాశం ఉందని వెల్‌కమ్‌ ట్రస్టు సీఈవో, ప్రముఖ వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ అభిప్రాయపడ్డారు. హెర్డ్‌ఇమ్యూనిటీ విషయంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా భారత్‌ను హెచ్చరించింది. సామూహిక రోగనిరోధకత కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే కరోనా వైరస్‌తో అనేకమంది మరణించే ప్రమాదముందని  డబ్ల్యూహెచ్‌వో ఆరోగ్య అత్యవసర విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైక్‌ రేయాన్‌ హెచ్చరించారు.

ఆ నిబంధనలే మనకు రక్ష 

ఏదో ఒక వ్యాక్సిన్‌ వచ్చేవరకు ఐసీఎంఆర్‌ సూచించిన కొవిడ్‌ వ్యతిరేక నిబంధనలు (మాస్క్‌, భౌతికదూరం, చేతులు శుభ్రం చేసుకోవటం) పాటించటమే సామాజిక వ్యాక్సిన్‌ అని రాజేశ్‌భూషణ్‌ పేర్కొన్నారు. దేశీయంగా అభివృద్ధిచేసిన రెండు కొవిడ్‌ వ్యాక్సిన్లపై 1, 2 దశల క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ నెల 26నుంచి 30 వరకు రోజూ సగటున 4,68,263 కొవిడ్‌ టెస్టులు నిర్వహించామని తెలిపారు. కొవిడ్‌ రికవరీ రేటు 64.44 శాతానికి పెరిగిందని వివరించారు. కొత్తగా నమోదవుతున్న కేసులకంటే రికవరీ 1.9రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు. 


logo