ఆదివారం 31 మే 2020
National - May 15, 2020 , 01:38:34

నిల్చొని ప్రయాణించటం బంద్‌!

నిల్చొని ప్రయాణించటం బంద్‌!

  •  ప్రయాణికులకు  టెంపరేచర్‌ చెక్‌
  • సీటు విడిచి సీటులో కూర్చోవాలి
  • కొత్త నియమాలతో ఢిల్లీ మెట్రో 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రజారవాణాకు కీలకమైన మెట్రోరైలు సేవలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 389 కిలోమీటర్ల పొడవు, 285 స్టేషన్లతో కూడిన ఈ అతిపెద్ద మెట్రో వ్యవస్థలో ప్రయాణికులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూసే బాధ్యతను కేంద్ర పారిశ్రామిక భద్రతాదళానికి (సీఐఎస్‌ఎఫ్‌) అప్పగించారు. 264 స్టేషన్లు, 2,200 కోచ్‌లు, 1,100 ఎస్కలేటర్లు, 1000 లిఫ్టులను ఇప్పటికే శానిటైజ్‌ చేశారు. రైల్‌ నెట్‌వర్క్‌ సన్నద్ధత కోసం 3,500 ట్రిప్పుల మేరకు ఖాళీగా రైళ్లను నడిపినట్లు డీఎంఆర్సీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుజ్‌దయాల్‌ తెలిపారు.  

  • రైలు ఎక్కే ప్రతి ప్రయాణికుడికి శరీర ఉష్ణోగ్రత చెక్‌చేస్తారు.
  • ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి. స్టేటస్‌ చెక్‌ చేసిన తర్వాతే అనుమతి
  • రైళ్లలో సీటు విడిచి సీటులో మాత్రమే కూర్చోవాలి. భౌతికదూరాన్ని గుర్తుచేసేలా ప్రతి సీటు వెనుక స్టిక్కర్లు 
  • నిలబడి ప్రయాణించేందుకు అనుమతి లేదు. టికెట్లు తీసుకొనే చోట కార్డు పేమెంట్‌ చేసేవారికి, నగదు చెల్లించేవారికి వేరువేరుగా వరుసలు.
  • కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతిస్తే మెట్రో స్టేషన్లలో శానిటైజేషన్‌ టన్నెళ్ల ఏర్పాటు.


logo