బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 18:37:08

కేంద్ర నూత‌న విద్యా విధానంపై స్టాలిన్ మండిపాటు

కేంద్ర నూత‌న విద్యా విధానంపై స్టాలిన్ మండిపాటు

చెన్నై : కేంద్ర ప్ర‌భుత్వ నూత‌న విద్యా విధానాన్ని డీఎంకే పార్టీ తీవ్రంగా వ్య‌తిరేకించింది. రాష్ర్టాల్లో హిందీ, సంస్కృతంను విధించే ప్ర‌య‌త్నంగా ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ అంశంలో సారుప్య‌త గ‌ల రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. కొత్త విద్యా విధానం భారీ సంస్కరణలు తెర‌తీయ‌డం కాద‌ని, పాత అణచివేత మనుస్మృతిపై నిగనిగలాడే కోటు అని స్టాలిన్ ఆరోపించారు. తన పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో కేంద్ర‌ ప్రభుత్వ ఇటువంటి ప్ర‌జా వ్య‌తిరేక‌ విధానాలపై పోరాడ‌నున్న‌ట్లు తెలిపారు. వైద్య విద్య ప్ర‌వేశాల్లో ఓబీసీ కోటా రిజ‌ర్వేష‌న్ స‌మ‌స్య‌పై మద్రాస్ హైకోర్టులో చేసిన పోరాటాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. 

దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉందన్నారు. జమ్ముక‌శ్మీర్‌లో రాజకీయ వ్యక్తులను అనైతికంగా నిర్బంధించడం గురించి స్టాలిన్ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. విజ‌య‌వంతంగా న‌డుస్తున్న 10 + 2 వ్యవస్థను కాద‌ని 5 + 3 + 3 + 4 ను ఎందుకు తీసుకువ‌స్తున్నార‌ని ఆయన ప్రశ్నించారు. పిల్లలకు వృత్తి విద్యను అందించ‌డంపై ఆయ‌న స్పందిస్తూ వారిపై అది మానసిక దాడిగా అభివర్ణించారు. సిల‌బ‌స్ నుండి విశ్వ‌విద్యాల‌యాల వ‌ర‌కు కేంద్రం త‌న నియంత్ర‌ణ‌లోకి తీసుకుంటుంద‌న్నారు.

ఇది భారత రాజ్యాంగం సమాఖ్య స్ఫూర్తిపై దాడి అని పేర్కొన్నారు. అందువల్లే డీఎంకే జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తుంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవలే కొత్త విద్యా విధానాన్ని ఆవిష్కరించింది. ఇది ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, విద్యార్థుల‌ను ప్ర‌పంచ‌స్థాయిలో పోటీప‌డేలా తీర్చిదిద్ద‌డం ల‌క్ష్యంగా పెట్టుకుంది. 


logo