శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 01:27:44

అసమ్మతిని అణచివేయలేం

అసమ్మతిని అణచివేయలేం

  • ప్రజాస్వామ్యంలో ఎవరి నోరు నొక్కలేం 
  • రాజస్థాన్‌ రాజకీయంపై సుప్రీం వ్యాఖ్య 
  • హైకోర్టు ఆదేశాల నిలుపుదలకు నిరాకరణ 

న్యూఢిల్లీ, జూలై 23: రాజస్థాన్‌ స్పీకర్‌ సీపీ జోషికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభ స్పీకర్‌ ఆదేశాల్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. రాజస్థాన్‌ హైకోర్టు ఆదేశాలను రద్దుచేయాలన్న విన్నపాన్ని తిరస్కరించింది. ప్రజాస్వామ్యంలో అసమ్మతిని అణచివేయలేమని స్పష్టంచేసింది. తిరుగుబాటు నేతలపై హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ స్పీకర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రజల చేత ఎన్నికైన వ్యక్తి అసమ్మతి వ్యక్తం చేయకూడదా?’ అని ప్రశ్నించింది. అసమ్మతి నేతల పిటిషన్లపై రాజస్థాన్‌ హైకోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వనుంది. మరోవైపు త్వరలోనే అసెంబ్లీలో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకుంటానని సీఎం గెహ్లాట్‌ తెలిపారు. రాష్ట్రంలో న్యాయాన్ని కాపాడేందుకు హైకోర్టులో దాఖలుచేసి పిటిషన్ల విచారణకు ఇంప్లీడ్‌ కావాలని పైలట్‌ వర్గం కేంద్రాన్ని కోరింది.

క్రెడిట్‌ సొసైటీ కుంభకోణంలో షెకావత్‌

రూ.900 కోట్ల విలువైన సంజీవని క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ కుంభకోణంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌పై విచారణ చేపట్టాలని జైపూర్‌ అదనపు జిల్లా జడ్జి పవన్‌కుమార్‌ ఆదేశాలు జారీచేసింది. ఈ సొసైటీనుంచి అప్పులు తీసుకున్న కంపెనీలతో కేంద్రమంత్రికి సంబంధం ఉందని దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించాలని అదనపు ఛీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు సూచించింది. 


logo