బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 07, 2020 , 18:18:57

డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్ హానికరం: సుప్రీంకోర్టుకు కేంద్రం

డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్ హానికరం: సుప్రీంకోర్టుకు కేంద్రం

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కోసం క్రిమిసంహారక సొరంగాల (డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్) వాడటం వైద్యపరంగా, మానసికంగా హానికరని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాంటి సొరంగాల వాడకాన్ని వెంటనే మానేయమని అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులకు సూచించింది. డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్ వాడకాన్ని ఎందుకు నిషేధించడం లేదని కోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. వాటిని వినియోగించవద్దని తగిన ఆదేశాలు రేపటికి జారీ చేస్తామని చెప్పారు. వచ్చే వారం ఈ పిటిషన్ ను విచారణకు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

క్రిమిసంహారక సొరంగాలు 16 నుంచి 25 అడుగుల పొడవైన నిర్మాణాలు. ఇవి క్రిమిసంహారక ద్రవాలను వీటి గుండా నడిచివెళ్లే ప్రజలపైకి పిచికారీ చేస్తాయి. ఒక స్ప్రేకు 60 సెకన్ల ఎక్స్పోజర్ చర్మం, బట్టలపైకి వచ్చిన వైరస్ ను నాశనం చేస్తుందని భావిస్తారు. చైనాలో ప్రారంభించిన ఈ రకం టన్నెల్స్ దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయితే ఈ టన్నెల్స్ గుండా నడవటం వల్ల నాసికా మార్గం, గొంతులో ఉండే లక్షణం లేని వ్యక్తి యొక్క వైరస్ ను నాశనం చేయలేమని వైద్యారోగ్య నిపుణులు భావిస్తున్నారు. వైరస్ కలిగివున్న వారు టన్నెల్ నుంచి నడిచివెళ్లి మార్కెట్లోగానీ, మాల్స్ లోగానీ ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చెందించే అవకాశాలు ఉంటాయిన వారు చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు భద్రతా భావనల కారణంగా ప్రజలు తమ రక్షణలను వదులుకోవడమే కాకుండా మాస్కులు వాడటం, చేతులు కడగటం, భౌతిక దూరం పాటించడం వంటి తప్పనిసరి భద్రతా చర్యలను దాటవేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక, ప్రజలపై పిచికారీ చేసే క్రిమిసంహారకాలు కఠినంగా ఉండి చర్మ సమస్యలకు దారితీస్తాయని వైద్యులు తెలిపారు. వాటిని పీల్చడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని వారు చెప్తున్నారు. కరోనా వైరస్ నివారణ చర్యలుగా శరీరంలో స్ప్రేలు, ఇతర క్రిమిసంహారక మందులను వాడకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇదివరకే సూచించింది.


logo