మంగళవారం 31 మార్చి 2020
National - Feb 15, 2020 , 02:03:38

కాంగ్రెస్‌ అంతర్థానం వల్లే ఓడాం

కాంగ్రెస్‌ అంతర్థానం వల్లే ఓడాం
  • ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి జవదేకర్‌ వ్యాఖ్య

పుణె: ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆకస్మిక అంతర్థానం వల్లే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అదృశ్యంతో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌)కు, తమ పార్టీకి మధ్య ముఖాముఖీ పోటీ జరిగిందన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఆకస్మిక అంతర్ధానం ఆ పార్టీ సొంత వ్యవహారం అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటుబ్యాంక్‌ ఆప్‌కు బదిలీ అయ్యిందని శుక్రవారం మీడియాతో చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 26 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌.. ఈ ఎన్నికల్లో కేవలం నాలుగు శాతానికి పరిమితమైందన్నారు. ‘మాకు 42 శాతం ఓట్లు వస్తాయి. ఆప్‌కు 48 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశాం. కానీ మా అంచనాలు విఫలమయ్యాయి. మాకు (బీజేపీ) 39 శాతం ఓట్లు లభిస్తే, ఆప్‌కు 51 శాతం ఓట్లు పోలయ్యాయి’ అని తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు ఉంటాయన్నారు. కానీ బీజేపీ అన్ని అంశాలను విశ్లేషిస్తుందన్నారు. తానెప్పుడూ కేజ్రీవాల్‌ను ‘ఉగ్రవాది’ అని అనలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 


logo
>>>>>>