బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 23, 2020 , 17:10:45

అవి డైనోసార్‌ గుడ్లేనా..?

అవి డైనోసార్‌ గుడ్లేనా..?

పెరంబలూర్‌: తమిళనాడు రాష్ట్రంలోని పెరంబలూర్‌ జిల్లాలోగల కున్నం పట్టణంలో ఇటీవల పురాతన గుండ్రటి వస్తువులు దొరికాయి. ఓ చెరువు వద్ద వీటిని స్థానికులు గుర్తించారు. వీటిని ఫొటో తీసి ‘డైనోసార్‌ గుడ్లు’ అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్కియాలజీ, జియాలజీ నిపుణులు రమేశ్‌ కరుప్పయ్య, ఏ ఆనందరాజ్, ఏ ప్రభుదేవా అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు. అవి అసలు డైనోసార్‌ గుడ్లు కావని తేల్చారు.

కున్నం పట్టణంలో దొరికిన కొన్ని వస్తువులు అమ్మోనైట్‌ అవక్షేపాలని వారు ధ్రువీకరించారు. ఏడు అడుగుల పొడవున్న చెట్టు శిలాజాన్ని గుర్తించారు. వాస్తవానికి ఈ చెట్టు 20 అడుగులు ఉంటుందని వారు అంచనా వేశారు. మిగిలిన భాగం కొట్టుకుపోయి ఉంటుందని శిలాజ నిక్షేపాల ముద్రలను బట్టి తేల్చారు. ‘మేము కున్నం ట్యాంక్‌లో అమ్మోనైట్ అవక్షేపాలను కూడా గుర్తించాం. అమ్మోనైట్ అనేక మిలియన్ సంవత్సరాలుగా కాంక్రీషన్ ప్రక్రియలో చిక్కుకొని ఉండాలి. ఇవి డైనోసార్ గుడ్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది.’ అని రమేశ్‌ తెలిపారు. అమ్మోనైట్లు పెద్ద, విభిన్న సముద్ర జాతులు. ఇవి 416 మిలియన్ సంవత్సరాల క్రితం డెవోనియన్ కాలంలో పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. వెంకటాన్ ట్యాంక్‌లో స్థానికులు గుర్తించిన 20-25 గోళాకార వస్తువులు డైనోసార్ గుడ్లు కాదని, వాటి గుడ్లు అంత పెద్ద పరిమాణంలో ఉండవని ఆ బృందం తెలిపింది. కాంక్రీషన్‌ వల్ల ఈ వస్తువులు ఏర్పడవచ్చు అని అభిప్రాయపడింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.