ఆదివారం 29 మార్చి 2020
National - Mar 26, 2020 , 18:44:04

తిరుమలలో మూడు రోజుల పాటు యాగం

తిరుమలలో మూడు రోజుల పాటు యాగం

తిరుమల: తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేదవిజ్ఞానపీఠంలో గురువారం శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం ప్రారంభమైంది.  విశ్వ‌మాన‌వ శ్రేయ‌స్సును ఆకాంక్షిస్తూ, శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ఈ యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరి స్వామిని ఆవాహన చేసి హోమాలు నిర్వహిస్తామని తెలిపారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, శ్రద్ధోత్సవాలు, శాంతి ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్పారు.

భయంగానీ, ఉపద్రవాలు గానీ, ప్రకృతి వైపరీత్యాలు గానీ, మహావ్యాధులు గానీ ప్రబలినప్పుడు శ్రీవారికి శాంతి ఉత్సవాలు చేపడతారని వివరించారు. ఈరోజు ఉదయం అకల్మష హోమంతో యాగం ప్రారంభమైంది. రాత్రి శ్రీ శ్రీనివాసమూర్తిని, శ్రీ ధన్వంతరిమూర్తిని కుంభంలోకి ఆవాహన చేస్తారు. మార్చి 27, 28వ తేదీల్లో విశేష హోమాలు నిర్వహిస్తారు.మార్చి 28న విశేషహోమం అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కుంభ జలాన్ని జలాశయంలో కలుపుతారు.ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి మేఘాల ద్వారా వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుంది.

యాగం కోసం శ్రీనివాసమూర్తికి 5, శ్రీ ధన్వంతరిమూర్తికి 1, ప్రాయశ్చిత్త హోమానికి 1 కలిపి మొత్తం 7 హోమ గుండాలను ఏర్పాటు చేశారు. 11 మంది రుత్వికులు పాల్గొన్నారు.ఈ యాగంలో నాలుగు వేదాల్లోని సూర్య జపానికి, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.


logo