బుధవారం 03 జూన్ 2020
National - Mar 28, 2020 , 15:06:17

తిరుమలలో ముగిసిన ధన్వంతరి మహాయాగం

తిరుమలలో ముగిసిన ధన్వంతరి మహాయాగం

తిరుమల : శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం ముగిసింది. విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ శ్రీవారి ఆశీస్సులు కోరుతూ కరోనా వైరస్‌, కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో ఈ నెల 26వ తేదీ నుండి నిర్వహించిన మహాయాగం నేటి మహా పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈఓ ఏవీ.ధర్మారెడ్డి, సీవిఈఎస్వో గోపినాథ్‌జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ప్రిన్సిపాల్‌ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి, రుత్వికులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు శ్రీమోహనరంగాచార్యులు మాట్లాడుతూ... ఈ యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రధాత అయిన శ్రీ ధర్వంతరిస్వామిని ఆరాధన చేసి హోమాలు, మంత్రపూరితమైన వాయువులను సమస్త ప్రపంచానికి సూర్యమండలం ద్వారా అందించినట్లు తెలిపారు. ఈ సమస్త ప్రపంచంలోని వనాలు, ఔషదాలు, చెట్లు తదితరాలు అంతా ధన్వంతరి స్వరూపాలన్నారు. ఈ యాగం ద్వారా అన్ని వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుందన్నారు. ప్రజలు ధన్వంతరి మహామంత్రాన్ని జపించడం వల్ల సమస్త వ్యాధులు నయం అవుతాయన్నారు. 

ఓం ధన్వానంతరాయ విద్మహే

సుధహస్తాయ ధీమహి

తన్నో విష్ణుప్రచోదయాత్‌ స్వాహా

ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వన్తరయే

అమృత కళశ హస్తాయ

సర్వభయ హరాయ

త్రిలోకనాథాయ విష్ణవే స్వాహా.

టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు సీతారామాచార్యులు మాట్లాడుతూ..ఏడు హోమగుండాలలో హోమాలు నిర్వహించడం ద్వారా 14 లోకాల్లోని దేవతల ఆశీస్సులు మానవులకు కలిగాలని ధన్వంతరి మహాయాగం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రధాన కుంభ మంత్ర జలాన్ని ధన్వంతరి స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ తీర్థ జలాన్ని తిరుమలలోని జలాశయంలో కలుపుతామన్నారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి మేఘాల ద్వారా వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుందన్నారు. 

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు పీఎం మోదీ, ఇరు తెలుగు రాష్ర్టాల సీఎంలు ఇచ్చిన పిలుపుమేరకు సమాజహితం కొరకు ప్రజలెవరూ బయటకు రావొద్దన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో టీటీడీ వేదపండితులతో తిరుమలలో ఈ నెల 16 నుండి 25వ తేదీ వరకు శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా 26 నుండి 28వ తేదీ వరకు ధన్వంతరి మహాయజ్ఞాన్ని నిర్వహించిందన్నారు. ఈ యాగం ద్వారా శ్రీ వేంకటేవ్వరస్వామివారి ఆశీస్సులతో ప్రపంచ మానవాళికి అశాంతిని, అనారోగ్యాన్ని దూరం చేసి సర్వతోముఖాభివృద్ధిని ప్రసాదించాలన్నారు.


logo