శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 20:16:04

26వ తేదీ నుంచి తిరుమ‌ల‌లో శ్రీ ధన్వంతరి మహాయాగం

26వ తేదీ నుంచి తిరుమ‌ల‌లో శ్రీ ధన్వంతరి మహాయాగం

  తిరుమల:  ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రు ఆరోగ్యంగా ఉండ‌డానికి స్వామివారి ఆశీస్సుల‌కై మార్చి 26 నుంచి 28వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో ధన్వంతరి మహాయాగం నిర్వహించనున్నారు. తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించనున్నట్లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞంలో భాగంగా రెండ‌వ రోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం  అద‌న‌పు ఈవో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బాగా ఆయ‌న మాట్లాడుతూ చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ వ‌ల‌న ప్ర‌పంచంలోని మ‌నుషులంతా భ‌య‌భ్రాంతుల‌కు లోన‌వుతున్నార‌న్నారు. శ్రీ మ‌హావిష్ణువు రూపాల‌లో స‌ర్వ రోగాల‌ను న‌యంచేసే ధ‌న్వంత‌రి రూపం ఒక‌ట‌ని, కావున ధ‌న్వంత‌రి యాగం నిర్వ‌హించ‌డం వ‌ల‌న మాన‌వాళికి న‌ష్టం క‌లిగించే వ్యాధులు న‌య‌మ‌వుతాయ‌న్నారు. విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూప‌నందేంద్ర స్వామివారు, మంత్రాల‌యం శ్రీ రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ సుబుదేంద్ర‌తీర్థ స్వామివార్ల ఆధ్వ‌ర్యంలో ఈ యాగం నిర్వ‌హిస్తార‌న్నారు. 

 శ్రీ ధన్వంతరి మహాయాగంకు ముందు జ‌ప‌య‌జ్ఞం నిర్వ‌హించ‌డంలో భాగంగా శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞంను మార్చి 16 నుండి 25వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌తో ప్ర‌పంచానికి సంపూర్ణ‌ ఆరోగ్యాన్ని, శాంతి సౌభాగ్యాల‌ను ప్ర‌సాదించ‌వ‌చ్చ‌న్నారు. ఈ జ‌పయ‌జ్ఞంలో వేద పాఠ‌శాల,వేదిక్ విశ్వ‌విద్యాల‌యం, సంస్కృత విద్యాపీఠంకు చెందిన‌ విద్యార్థులు, అధ్యాప‌కుల‌చే  వేద పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, క‌ర్ణాట‌క రాష్ట్ర టీటీడీ వేద‌పారాయ‌ణ ప‌ర్య‌వేక్ష‌కులు బ్ర‌హ్మ‌శ్రీ హ‌రి వీరభ‌ద్ర ఘ‌ణ‌పాటి, ఆంధ్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన 30 మంది వేద పండితులు పాల్గొన్నారు. 


logo