గురువారం 21 జనవరి 2021
National - Jan 14, 2021 , 14:30:57

20 నెల‌ల చిన్నారి.. తాను మ‌ర‌ణించి ఐదుగురిని బ‌తికించింది!

20 నెల‌ల చిన్నారి.. తాను మ‌ర‌ణించి ఐదుగురిని బ‌తికించింది!

న్యూఢిల్లీ: ఆ చిన్నారికి 20 నెల‌ల‌కే నిండు నూరేళ్లూ నిండాయి. బోసి న‌వ్వుల‌తో, బుడి బుడి అడుగుల‌తో క‌న్న‌వారి క‌ళ్ల‌ల్లో ఆనందం నింపాల్సిన ఆ ప‌సిపాప‌.. అప్పుడే తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది. అయితేనేం.. తాను వెళ్తూ వెళ్తూ మ‌రో ఐదుగురి ప్రాణాల‌ను కాపాడింది. ధ‌నిష్తా అనే ఆ 20 నెల‌ల చిట్టిత‌ల్లి.. ఇప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వ‌య‌సు అవ‌య‌వ దాత‌గా నిలిచింది. ఈ నెల 8న బాల్క‌నీలో నుంచి కింద ప‌డిన ధ‌నిష్తాను గంగారామ్ ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా.. ఈ నెల 11న ఆ పాప బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. 

అంత‌టి విషాదంలోనూ త‌ల్లిదండ్రులు ఆశిశ్ కుమార్‌, బ‌బితా.. ఆ చిన్నారి అవ‌య‌వాల‌ను దానం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌డా అవ‌యవాలే ఐదుగురి ప్రాణాల‌ను కాపాడిన‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పాప గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాల‌ను ఐదుగురు పేషెంట్ల‌కు ఇచ్చారు. తాము ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో అవ‌య‌వాల కోసం చూస్తున్న ప‌లువురిని క‌లిశామ‌ని ఆశిశ్ కుమార్ చెప్పారు. మా పాప చ‌నిపోయినా.. ఆ ఐదుగురిలో జీవించే ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. 

తాజావార్తలు


logo