శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 03, 2021 , 08:08:54

వ్యాక్సిన్లకు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్‌?

వ్యాక్సిన్లకు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్‌?

హైదరాబాద్‌ : కరోనా అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. రెండు వాక్సిన్లకు నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో.. ఆదివారం డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా మీడియా సమావేశం నిర్వహిస్తుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు వ్యాక్సిన్ల వినియోగం, అనుమతులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకాను ‘కొవిషీల్డ్‌’ పేరుతో పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తుండగా.. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ ‘కొవాగ్జిన్‌’ టీకాను ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో పూర్తిస్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. జనవరి ఒకటిన కొవిషీల్డ్‌కు, 2న కొవాగ్జిన్‌కు సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ అత్యవసర వినియోగానికి అనుమతి తెలుపుతూ డీసీజీఐకి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ వ్యాక్సిన్ల వినియోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే రాబోయే వారం రోజుల్లో వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుకానుంది. ఇదిలా ఉండగా.. అమెరికా దిగ్గజం ఫైజర్‌ కంపెనీ చేసిన దరఖాస్తుపై ఇంకా నిపుణుల కమిటీ చర్చించలేదు. అలాగే అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిల్లా వ్యాక్సిన్‌ మూడో విడత ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లతో పాటు మరో రెండు వ్యాక్సిన్లు రాబోయే మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.


logo