మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 22:44:23

పాఠశాలలకు యునిసెఫ్ మార్గదర్శకాలు

పాఠశాలలకు యునిసెఫ్ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న నేపథ్యంలో దేశంలోని చాలా ప్రాంతాల్లోపాఠశాలలు ప్రారంభమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా అనుమతించింది. పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా వారి భద్రతను నిర్ధారించడం చాలా ముఖ్యం. ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) పాఠశాల పరిపాలన కోసం కొన్ని సూచనలు, మార్గదర్శకాలను పాఠశాలలకు అందించింది. 

విద్యార్థుల ఆరోగ్యం కోసం యూనిసెఫ్ జారీ చేసిన సూచనలు

* పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మధ్య కనీసం ఒక మీటర్ దూరం ఉండాలి

* డెస్క్ మధ్య అంతరాన్ని మీటర్ మేరకు పెంచాలి. 

* ప్రవేశ ద్వారాల వద్ద, క్యూలలో మీటర్ దూరం తప్పనిసరిగా ఉండేలా చూడాలి.

* పాఠాలను ఆరుబయట లేదా వెంటిలేషన్ బాగా వచ్చే గదులకు తరలించాలి.

* సురక్షితమైన నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి

* చేతుల వెనుకభాగాలు సహా వేళ్ల మధ్య, గోర్లు కింద కనీసం 20 సెకన్ల పాటు రుద్దాలి. 

* శుభ్రమైన టవల్ తో చేతులు తుడుచుకోవాలి.

* హ్యాండ్‌వాషింగ్ కోసం 60 శాతం ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించాలి.

* పాఠశాలకు వచ్చినప్పుడు, తిరిగి ఇంటికి వెళ్లగానే చేతులను శుభ్రంగా కడుక్కోవడం పిల్లలకు నేర్పాలి.

* తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు మోచేయిని అడ్డుగా పెట్టుకునేలా నేర్పించాలి.

* పాఠశాలకు వచ్చే విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలు నిత్యం నమోదు చేయాలి.

* ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే వారిని ఇంటివద్దనే ఉండేలా చూడాలి.

* విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి కరోనా లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యాధికారికి సమాచారం అందించాలి.

* కరోనా లక్షణాలు కనిపించినట్లయితే స్వీయ నిర్బంధంలోకి వెళ్లేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.

* విద్యార్థులకు కరోనాకు సంబంధించిన సమాచారంతో కూడా బుక్ లెట్ అందివ్వాలి.

"విద్యార్థులు తరుచుగా ముట్టుకోవడానికి అవకాశాలున్న డెస్క్‌లు, కౌంటర్‌టాప్‌లు, డోర్ నోబ్‌లు, కంప్యూటర్ కీబోర్డులు, నేర్చుకునే వస్తువులు, కుళాయిలు, ఫోన్లు, బొమ్మలు వంటి వాటిని నిత్యం శుభ్రపరిచి, శానిటైజ్ చేయాలి" అని యునిసెఫ్ సిఫార్సు చేసింది.


logo