ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 11:42:10

మరింత పెరిగిన కాలుష్యం.. 486కి పెరిగిన ఏక్యూఐ

మరింత పెరిగిన కాలుష్యం.. 486కి పెరిగిన ఏక్యూఐ

న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి కాలుష్యం శనివారం మరింత పెరిగింది. దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 486గా రికార్డయిందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) తెలిపింది. పొంగమంచు బురారీ, పీరాగర్హి, కాశ్మీరీగేట్‌, ముఖర్జీనగర్‌ సహా పలు ప్రాంతాలను కప్పివేసింది. వాయు కాలుష్యంతో ఆటోలు నడుపడం కష్టంగా ఉందని ఓ ఆటో డ్రైవర్‌ తెలిపాడు. ప్రజలు దీపావళికి ముందే టపాసులు కాల్చడం ప్రారంభించారని, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు బాధ్యత ప్రభుత్వం, పోలీసులదే కాదు ప్రతి ఒక్కరిదని పేర్కొన్నాడు.


ఉదయం వాకింగ్‌ సమయంలో వాయు కాలుష్యంగా ఇబ్బందులు పడుతున్నామని, ఎదురుగా ఏమీ కనిపించడం లేదని స్థానికుడొకరు తెలిపారు. గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే శుద్ధమైందిగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం.. వాయుకాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కరోనా మహమ్మారితో పలువురు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కాలుష్యంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వాయుకాలుష్యంతో పెద్దవాళ్లతో పాటు కొందరు పిల్లలు గొంతు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున బాణాసంచ కాలిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆప్‌ సర్కారు ఈ నెల 7 నుంచి 30వ తేదీ వరకు బాణాసంచ విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10వేల వరకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.