శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 01:16:21

సీబీఐ దర్యాప్తులపై రాష్ట్రల అనుమతి నిరాకరణ

సీబీఐ దర్యాప్తులపై రాష్ట్రల అనుమతి నిరాకరణ

  • టీఆర్పీ కేసుపై తాజాగా మహారాష్ట్ర నిర్ణయం
  • ఇప్పటికే నిరాకరించిన పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం
  • రాజకీయాల్లో పావులా కేంద్ర దర్యాప్తు సంస్థ 
  • అధికారంలో ఉన్నోళ్లకు వంతపాడుతుందనే అపవాదు

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ).. దేశంలో సంచనలనాత్మక కేసులేవైనా దర్యాప్తు చేసే సంస్థ ఇదే.. సీబీఐ దృష్టి పడిందంటే నేరస్థులకు మూడినట్టే అంటారు. అయితే ఇదంతా ఒక కోణమైతే.. మరో కోణం కూడా ఉన్నది. మన దేశంలోని జాతీయ దర్యాప్తు సంస్థల్లో అత్యంత వివాదాస్పదమైన సంస్థ ఇదే. అధికారంలో ఎవరుంటే వాళ్లు చెప్పినట్టు ఆడుతుందనే విమర్శలు సీబీఐపై నిత్యకృత్యం. ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై కేంద్రప్రభుత్వాలు సంధించే మొదటి బాణం సీబీఐనే అనేది పరిశీలకుల మాట. ఈ కారణంతోనే పలు రాష్ర్టాలు సీబీఐకి తమ రాష్ర్టాల్లోని కేసులపై దర్యాప్తులు చేపట్టకుండా అడ్డుకుంటున్నాయి. తాజాగా టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్స్‌ (టీఆర్పీ) కుంభకోణంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకున్నది. మహారాష్ట్రలో సీబీఐకి సాధారణ అనుమతులను రద్దుచేసింది. 

రాష్ర్టాల అనుమతి ఉండాల్సిందే

ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ (డీపీఎస్‌ఈ)-1946 ప్రకారం దేశంలోని ఏ మూలలోనైనా ఏ కేసునైనా విచారించేందుకు సీబీఐకి అవకాశం ఉన్నది. అయితే, రాష్ర్టాల్లో దర్యాప్తులు చేపట్టేందుకు ఆయా రాష్ర్టాల సాధారణ అనుమతులు అవసరమని ఈ చట్టంలోని సెక్షన్‌-6 నిర్దేశిస్తున్నది. లేని పక్షంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు రాష్ర్టాల అనుమతి లేకుండానే సీబీఐ దర్యాప్తులు చేపట్టవచ్చు. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి ఈ విషయంలో అపరిమిత అధికారాలు ఉన్నాయి. దేశంలోని ఏ మూలలోనైనా ఉగ్రవాద చర్యలపై దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్‌ఐఏకు ఉన్నది. ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉగ్రవాద కేసులను మాత్రమే ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుంది. అందువల్ల ఆ సంస్థపై ఏ రకమైన రాజకీయ విమర్శలు రాలేదు. సీబీఐ చేపట్టే కేసుల్లో అత్యధికం రాజకీయాలతో ముడిపడి ఉంటుండటంతో దానిపై అనేక విమర్శలు చెలరేగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మిజోరం, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లు సీబీఐకి సాధారణ అనుమతులు నిరాకరించాయి.

టీఆర్పీపై దొడ్డిదారిన రంగంలోకి?

ఈ నెల 6న ముంబైలో స్థానిక పోలీసులు చేధించిన టీఆర్పీ కుంభకోణం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య కేసు.. డ్రగ్స్‌ ఆరోపణలు, మహారాష్ట్ర సర్కార్‌తో సినీనటి కంగనా రనౌత్‌ గొడవ విషయాల్లో రిపబ్లిక్‌ టీవీ మహారాష్ట్ర సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో కుట్రతోనే తమను ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లించింది. ఆ తర్వాత రెండు రోజులకే 17వ తేదీన ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లక్నోలో కమల్‌ శర్మ అనే యాడ్‌ ఏజెన్సీ నిర్వాహకుడు టీఆర్పీ కుంభకోణంపై ఇచ్చిన ఫిర్యాదుతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా టీఆర్పీలలో కుంభకోణం జరిగినట్టు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 24 గంటలు తిరగకుండానే యూపీ సర్కార్‌ ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఆ తెల్లారే 19వ తేదీన ఈ కేసును దర్యాప్తు చేయాలని సీబీఐని కేంద్రం ఆదేశించింది. మహారాష్ట్ర సర్కార్‌ సీబీఐ దర్యాప్తునకు నిరాకరించినప్పటికీ బీజేపీ అధికారంలో ఉన్న యూపీ ద్వారా సీబీఐ ఇందులోకి ప్రవేశించటం అనుమానాలకు తావిచ్చింది. అందుకే తమ రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా నిషేధం విధించామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు.